పాప ప్రాణం కోసం రూ.16 కోట్ల ఇంజెక్షన్

పాప ప్రాణం కోసం రూ.16 కోట్ల ఇంజెక్షన్

ఐదు నెలల చిన్నారి. ఇంకో నెల మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఇవేమీ తెలియని ఆ పాప…చావుబతుకుల మధ్య చిరునవ్వులు చిందిస్తోంది. ఆ చిరునవ్వులు చిరకాలం ఉండాలంటే..ఓ స్పెషల్ ఇంజక్షన్ వేయాలి. అది మన దగ్గర దొరకదు. దాని రేటు వింటేనే ప్రాణాలు పోతాయి. ఆ ఇంజక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్లు. దాని పేరు జాల్ గెన్జ్ మా. తలో చేయి వేసి ఆ పదహారు కోట్లను జమచేశారు. ఇక మిగిలింది ఇంజక్షన్ తెప్పించడమే..

తీరా కామత్..ఈ ఐదు నెలల చిన్నారి..బతకాలంటే 16 కోట్ల విలువైన ఇంజక్షన్ వేయాల్సిందే. ఆ ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించాలి. ఆ సూదీ వేసిన ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ అంటున్నారు డాక్టర్లు. తమ బిడ్డని కాపాడుకునేందుకు.. పేరెంట్స్ మిహిర్ , ప్రియాంక అష్టకష్టాలు పడుతున్నారు. తీరా ప్రస్తుతం ముంబైలోని SRCC హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.

తీరా పుట్టినప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. పాలు తాగెటప్పుడు తీరా ఇబ్బంది పడేది. ఆ బాధతో పాలు తాగడం మానేసింది. వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్లినప్పుడు చిన్నారి అసలు సమస్య ఏంటో తల్లిదండ్రులకు తెలిసింది. న్యూరాలజిస్టుకు చూపించాల్సిందిగా డాక్టర్లు సూచించారు. SMA టైప్  1 సమస్యతో తీరా బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్లు.

SMA.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. వెన్నెముక కండరాల క్షీణతే ఈ వ్యాధి ముఖ్య లక్షణం. SMAలో టైప్  1 చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. తీరా ప్రస్తుతం SMA టైప్ 1 తో బాధపడుతోంది. ఆ చిన్నారి ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. తీరాను ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచారు. వెంటిలేటర్  మీద ఎక్కువ కాలం పెడితే..ట్యూబ్  ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మానవుల శరీరంలో ఉండే ఒక జన్యువు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్ లు కండరాలు, నరాలు మనుగడకు ఉపయోగపడతాయి. ప్రోటీన్లను ఉత్పత్తి చేసే ఆ జన్యువు తీరా శరీరంలో లేదు. ఆ జీన్  లేకపోవడంతో ప్రొటీన్ లు ఉత్పత్తి కాలేదు. ప్రొటీన్ లు లేకపోవడంతో నరాలు, కండలు జీవం లేకుండా పోయాయి. మెదడు వరకు వెళ్లే నరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అవి వీక్ గా ఉండటంతో చిన్నారి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది.

తీరా బతకాలంటే స్పెషల్ ఇంజక్షన్ వేయాలని డాక్టర్లు సూచించారు. కానీ ఆ ఒక్క ఇంజక్షన్ రేటు 16 కోట్లు ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు తమ చిన్నారికి ఏం కాదనుకున్నా తల్లిదండ్రలు..ఆ రేటు విని షాకయ్యారు. మిహిర్  ఐటీ సర్వీస్  సెంటర్ లో పని చేస్తుండగా, ప్రియాంక ఫ్రీలాన్స్ ఇలస్ట్రేటర్. వాళ్లకు 16 కోట్లంటే మామూలు విషయం కాదు.  తమ దగ్గర అంత సొమ్ము లేదు. ఉన్న ఆస్తి అమ్మినా వర్కవుట్ కాదు. బంధువుల్ని అడిగినా అంతా రాదు. పాప ప్రాణం దక్కాలంటే..16 కోట్ల విలువైన ఇంజక్షన్ తెప్పించాలే. ఏం చేయాలి.. ఎలా చేయాలి..వాళ్ల అదృష్టమో..పాప అదృష్టమో కాని..క్రౌడ్  ఫండింగ్  వాళ్లకో దారి చూపింది.

విదేశాల్లో ఇలాంటి క్లిష్టమైన వ్యాధుల ట్రీట్ మెంట్ కు క్రౌండ్  ఫండింగ్  బాగా ఉపయోగపడుతుంది. మిహిర్ , ప్రియాంకలు కూడా దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. తీరా ఆరు నెలల కంటె ఎక్కువ బతకదని డాక్టర్లు చెప్పారు. ఈ ఆర్నేళ్లలోనే 16 కోట్లు కూడబెట్టాలని డిసైడ్ అయ్యారు. తీరా పరిస్థితిని మిహిర్ , ప్రియాంక ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విటర్ , ఇన్ స్టాగ్రామ్ , ఫేస్ బుక్ లలో TeeraFightsSma పేరుతో పేజ్ లు క్రియేట్ చేశారు. చిన్నారి హెల్త్ పై డే టు డే అప్ డేట్స్ పోస్టులు పెట్టారు. సాయం చేయాల్సిందిగా ప్రజలకు విజ్జప్తి చేశారు. తీరా ప్రతి ఒక్కరినీ కదిలించింది. తలో కొంత సాయం చేశారు. 16 కోట్ల రూపాయలు జమా అయ్యాయి. డాక్టర్లు అమెరికా నుంచి ఇంజెక్షన్ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఇంజెక్షన్ తో సమస్య పూర్తిగా పరిష్కారం కాదంటున్నారు డాక్టర్లు. కొంత వరకు బెటరంటున్నారు. ఇవేమీ తెలియని తీరా..చిరు నవ్వుతో ముచ్చటిస్తోంది. పెద్ద పెద్ద కళ్లతో పలకరిస్తోంది. ఆ చిరునవ్వు తీరా ముఖంలో ఎల్లకాలం ఉండాలని మనం కూడా దేవుణ్ని కోరుకుందాం.