కోర్టు కాంప్లెక్స్ జాగాపై మళ్లీ లడాయి

కోర్టు కాంప్లెక్స్ జాగాపై  మళ్లీ లడాయి
  • అనంతపురం గుట్టల్లో నిర్మాణానికి టెండర్లు
  • ల్యాండ్ లెవలింగ్ కే 19 కోట్లు కావాలని ప్రపోజల్స్
  • అందరికీ అనువైన చోట కట్టాలంటున్న కొందరు లాయర్లు 

గద్వాల, వెలుగు: కోర్టు కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించాలన్న అంశంపై మళ్లీ లడాయి షురువైంది. పట్టణానికి దూరంగా అనంతపురం గుట్టల్లో కోర్ట్​ బిల్డింగులు కట్టాలని నిర్ణయించారని, అక్కడ స్థలాన్ని చదును చేయడానికే రూ. 19 కోట్లు ఖర్చవుతుందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తున్నా అనంతపురం గుట్టల్లోనే కోర్టు కాంప్లెక్స్​ నిర్మించేందుకు టెండర్​ పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టల్లో కోర్టు వద్దంటూ ఆందోళనలు చేసిన బార్ అసోసియేషన్, ప్రజాసంఘాలు తిరిగి పోరుబాట పట్టేందుకు సిద్దమవుతున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు రాష్ట్రంలో 12 జిల్లాల్లో కోర్టుల నిర్మాణం కోసం 2024 నవంబర్​14న ప్రభుత్వం జీఓ జారీ చేస్తూ.. ఒక్కొక్క జిల్లాకు రూ. 81 కోట్లు కేటాయించింది. ఇందుకోసం స్థలసేకరణ చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించింది. పూడూరు శివారులోని అనంతపురం గుట్టల్లో సర్వేనెంబర్ 368లో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని గుర్తించగా.. జిల్లా యంత్రాంగం ఆ స్థలాన్ని కోర్టు నిర్మాణం కోసం కేటాయించింది. అయితే అక్కడ కోర్టు వద్దంటూ కొందరు లాయర్లు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడున్న కోర్టు కాంప్లెక్స్​లోనే నిర్మించాలని, లేదంటే పీజేసీ క్యాంపు, సిద్ధాంతవారి కుంట, ఇప్పుడు ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసు ఉన్న చోట కట్టాలని సూచించారు. దీంతో స్థలసేకరణ ప్రక్రియ కొంతకాలం ఆగిపోయింది.

ఏకాభిప్రాయం కోసం అధికారుల ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. కొందరు లీడర్లు, లాయర్లు తమకు అనుకూలంగా ఉండే చోట కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం జరిగేలా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు అనంతపురం గుట్టల్లో స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ బిల్డింగ్​ కట్టాలంటే ల్యాండ్ లెవెలింగ్ కోసం రూ. 19కోట్లు అవసరమవుతుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రపోజల్స్ పంపించారు. ఈ ఖర్చుతో బయట ఎక్కడైనా 5 ఎకరాలు కొనుగోలు చేయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఏ నిర్ణయం తీసుకోలేదు 

కోర్టు కాంప్లెక్స్ నిర్మాణంపై కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే స్థల పరిశీలన చేశాం. ప్రభుత్వం, కలెక్టర్ నిర్ణయం మేరకు నిర్మాణం చేపడతాం. లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ గద్వాల