గ్రామాల్లో మౌలికస‌దుపాయాల‌కు రూ.4200 కోట్లు.. రైతుల‌కు 25 వేల కోట్ల రుణాలు

గ్రామాల్లో మౌలికస‌దుపాయాల‌కు రూ.4200 కోట్లు.. రైతుల‌కు 25 వేల కోట్ల రుణాలు

ఆత్మ నిర్భ‌ర భార‌త్ ప్యాకేజీలో రెండో భాగం వల‌స కూలీలు, రైతులు, స్ట్రీట్ వెండార్స్, చిన్న వ్యాపారులు, స్వ‌యం ఉపాధి పొందుతున్న వారు ల‌క్ష్యంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. ఇప్ప‌టికే 3 కోట్ల‌ మంది రైతుల‌కు రూ.4.22 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌కు సంబంధించి మూడు నెల‌ల మారిటోరియం విధించిన‌ట్లు గుర్తు చేశారు. త‌మ రుణాల‌ను నిర్ణీత స‌మ‌యంలోనే చెల్లించే రైతుల‌కు ఇచ్చే వ‌డ్డీ రాయితీ వెసులుబాటును మే 31 వ‌ర‌కు పొడిగిస్తున్నామ‌ని చెప్పారు.

లాక్ డౌన్ పీరియ‌డ్ లోనూ కొత్త‌గా 25 ల‌క్ష‌ల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామ‌న్నారు. ఈ కార్డులు వ‌చ్చిన వారికి రూ.25 వేల కోట్ల రుణాలు ఇస్తామ‌న్నారు. అలాగే మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు 63 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.86,600 కోట్ల లోన్లు మంజూరు చేశామ‌ని తెలిపారు. నాబార్డు ద్వారా స‌హ‌కార బ్యాంకులు, రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల‌కు రూ.29,500 కోట్లను రీఫైనాన్స్ చేసిన‌ట్లు చెప్పారు నిర్మ‌లా సీతారామ‌న్. గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల కల్ప‌న కోసం మార్చి నెల‌లో 4200 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను రాష్ట్రాల‌కు అందించామ‌న్నారు. రైతులు పండించిన పంట‌ల‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు మార్చి నుంచి రూ.6700 కోట్ల వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ ప‌రిమితి క‌ల్పించిన‌ట్లు చెప్పారు.

https://twitter.com/PIB_India/status/1260883938341294082

క‌రోనా లాక్ డౌన్ తో కుదేలైన ఆర్థిక రంగాన్ని పున‌రుజ్జీవం క‌ల్పించేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం రూ. 20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించారు. ఆత్మ నిర్భ‌ర భార‌త్ పేరుతో ప్ర‌క‌టించిన ఈ ప్యాకేజీ వివ‌రాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మీడియాకు వెల్ల‌డించారు. నిన్న విద్యుత్ డిస్క‌మ్స్, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగులు, ప్ర‌భుత్వ కాంట్రాక్టులు, రియ‌ల్ ఎస్టేట్ రంగం, ఎన్బీఎఫ్సీల‌కు సంబంధించిన ఆర్థిక వెసులుబాటు, సాయం గురించి వివ‌రించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. బుధ‌వారం ఒక్క రోజే దాదాపు 5 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ప్యాకేజీని ప్ర‌క‌టించిన ఆమె.. ఆత్మ నిర్భ‌ర భార‌త్ ఆర్థిక ప్యాకేజీలో రెండో పార్ట్ ను ఇవాళ‌ ప్ర‌జ‌ల ముందుంచారు. వ‌ల‌స కార్మికులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే స్ట్రీట్ వెండ‌ర్స్, చిన్న స‌న్న‌కారు రైతులు, స్వ‌యం ఉపాధి పొందుతున్న‌వారికి సంబంధించిన ప్యాకేజీ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్పారామె.