V6 News

రూ. 2,600 కోట్ల ఇన్సెంటివ్ స్కీంకు కేంద్రం ఆమోదం

రూ. 2,600 కోట్ల ఇన్సెంటివ్ స్కీంకు కేంద్రం ఆమోదం
  • ఆమెదం తెలిపిన కేంద్రం కేబినెట్ 
  • మూడు మల్టీస్టేట్ కోఆపరేటివ్స్ కూ ఆమెదం

న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ ద్వారా తక్కువ మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ రూ. 2,600 కోట్ల ఇన్సెంటివ్ స్కీంకు ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  రూపే, యూపీఐ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), ఈ–కామర్స్ ట్రాన్సాక్షన్లను ప్రమోట్ చేసేలా బ్యాంకులకు ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నారు. ఈ పథకంతో దేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, యూపీఐ లైట్, యూపీఐ 123పేకు ఆదరణ కూడా పెరుగుతుందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2022–23 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ స్కీంను ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. డిజిటల్ పేమెంట్లు ఏటేటా పెరుగుతున్నాయని, కరోనా విపత్తులో ఈ విధానంతో ఎంతో మేలు జరిగిందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 2020–21లో రూ. 5,554 కోట్ల డిజిటల్ పేమెంట్లు జరగగా, 2021–22లో 8,840 కోట్లకు పెరిగాయని, మొత్తంగా 59% గ్రోత్ రేట్ నమోదైందని పేర్కొంది.  

మూడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ కూ ఓకే 

ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కొత్తగా మూడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 ప్రకారం.. దేశంలో కోఆపరేటివ్స్ ద్వారా ఎగుమతులు, ఆర్గానిక్, సీడ్ బిజినెస్ ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం మేరకు.. నేషనల్ లెవెల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఎక్స్ పోర్ట్ సొసైటీ, నేషనల్ లెవెల్ మల్టీ స్టేట్ సీడ్ కోఆపరేటివ్ సొసైటీ, నేషనల్ లెవెల్ మల్టీ స్టేట్  కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏర్పాటు కానున్నాయి.