V6 News

ఆర్సీబీపై రివేంజ్ తీర్చుకున్న టైటాన్స్.. ఘోరంగా ఓడిన బెంగళూరు

ఆర్సీబీపై రివేంజ్ తీర్చుకున్న టైటాన్స్.. ఘోరంగా ఓడిన బెంగళూరు

GT vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT) అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి, 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఓ అడుగు ముందుకు వేసింది.

గిల్ మెరుపు ఇన్సింగ్స్: 
లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 42 పరుగుల వద్ద సాయి సుదర్శన్ (6) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆర్సీబీ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో భువీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. అనంతరం జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. మధ్యలో షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ (11) తక్కువ స్కోరుకే అవుట్ అయి ఉత్కంఠ రేపినప్పటికీ, చివర్లో రాహుల్ తెవాటియా భారీ షాట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు.

భువీ పోరాటం వృథా: 
ఆర్సీబీ బౌలర్లలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (3 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు తీయగా, సుయాష్ శర్మకు ఒక వికెట్ దక్కింది. అయితే స్వల్ప స్కోరు కావడంతో బెంగళూరు బౌలర్లు ఓటమిని అడ్డుకోలేకపోయారు. కేవలం 15.5 ఓవర్లలోనే మ్యాచ్ ని ఖతం చేసేసింది గుజరాత్.