
- వాటర్ ట్యాంక్‌లు, పైప్లైన్నిర్మాణాలకు ఎంపీ శంకుస్థాపన
- 2026 ఆగస్టులోగా పూర్తి చేయడమే లక్ష్యం
- మెదక్ పట్టణంలో తీరనున్న తాగునీటి తిప్పలు
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో తాగునీటి తిప్పలు తీరనున్నాయి. అమృత్ స్కీం కింద ఎంపిక చేసిన మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మెదక్ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు సంబంధిత పనులకు గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు.
చేపట్టే పనులు ఇవే..
పెరుగుతున్న జనాభా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమృత్ స్కీం కింద వాటర్ ట్యాంక్‌లు, పైప్లైన్నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. పబ్లిక్హెల్త్డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనుండగా.. టెండర్లు ఇదివరకే ఖరారయ్యాయి. 600 కిలో లీటర్ల కెపాసిటీ గల సంప్, 3,300 కిలో లీటర్ల కెపాసిటీ గల 5 వాటర్ ట్యాంక్‌లు నిర్మించనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఔరంగాబాద్ లో 1,300 కిలో లీటర్లు, దాయరలో 2,500 కిలో లీటర్లు, అవుసులపల్లిలో 3,500 కిలో లీటర్లు, నవాపేటలో 4,500 కిలో లీటర్ల కెపాసిటీ, 132/33 కేవీ సబ్ స్టేషన్వద్ద 5,100 కిలో లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ లను నిర్మిస్తారు. అలాగే పట్టణంలోని ఆయా ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం 32 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం చేపడుతారు. మొత్తం 3,896 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.
‘భగీరథ’తో సరిపడా అందని నీరు
సుమారు 80 వేల జనాభా ఉన్న మెదక్ పట్టణంలో ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం గతంలో రూ.50 కోట్లతో మిషన్‌భగీరథ స్కీం కింద పనులు చేపట్టారు. అయినా సరిపడా నీరందడం లేదు. అంతేకాకుండా పలు కొత్త కాలనీలు ఏర్పాటవడంతో తాగునీటి అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అమృత్ స్కీం కింద కొత్త ట్యాంక్‌లు, పైప్ లైన్నిర్మాణం చేపట్టనుండటంతో ఇబ్బందులు తీరనున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని అమృత్ స్కీం కింద తాగునీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. 2026 ఆగస్టులోగా ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.