30 కోట్ల పనులు చేస్తే.. నామరూపాల్లేవ్‌‌

30 కోట్ల పనులు చేస్తే.. నామరూపాల్లేవ్‌‌
  • ‌మేడారంలో ఏడాది గడవకముందే పాడైన బీటీ రోడ్లు
  • ఇంకా ప్రారంభికముందే పగుళ్లు తేలిన షెడ్లు
  • పైపైన పనులు చేసి నిధులు బొక్కే సిన కాంట్రాక్టర్లు
  • ఈ నెల 24 నుంచి మేడారం మినీ జాతర

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: గతేడాది మేడారం మహాజాతర సందర్భంగా పస్రా నుంచి మేడారానికి వెళ్లే రోడ్డు రిపేర్ల కోసం  ప్రభుత్వం రూ.50 లక్షలు ఖర్చు చేసింది. ఆఫీసర్లు రిపేర్లు చేసి ఏడాది గడవకముందే సుమారు 200 చోట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వెహికల్స్​ రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. మేడారంలోని జంపన్నవాగులో గతేడాది ఇసుక లెవెలింగ్‌‌ కోసం రూ.54 లక్షలు ఖర్చుచేశారు. జంపన్నవాగులో అనవసరంగా రూ.5 కోట్లు ఖర్చుచేసి నిర్మించిన చెక్‌‌డ్యాంల వల్ల ఇసుక కొట్టుకుపోతుందని ఈ చెక్‌‌డ్యాంలను తొలగిస్తామని అప్పుడే రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రకటించారు. ఏడాది గడిచినా చెక్‌‌ డ్యాం తొలగింపు పనులు జరపలేదు. దీంతో మళ్లీ ఇప్పుడు ఐబీ శాఖ రూ.లక్షలు ఖర్చుచేసి మళ్లీ ఇసుక లెవలింగ్‌‌ పనులు చేపట్టింది.

మేడారం మహాజాతర 2020 కోసం రూ.75 కోట్లతో చేపట్టిన పనులలో రూ.30 కోట్ల పనులు ఏడాదిలోపలే నామరూపాల్లేకుండా పోయాయ్‌‌. మేడారం చుట్టుప్రక్కల వేసిన బీటీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. భక్తులకోసం కట్టిన షెడ్లు ప్రారంభించకముందే పగుళ్లువచ్చాయి. ఆఫీసర్లు, లీడర్ల అండతో పైపైన పనులు చేసి కాంట్రాక్టర్లు నిధులు కాజేశారు.

రూ.వందల కోట్ల నిధులతో పనులు

మేడారం భక్తులకు పర్మినెంట్​గా సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సర్కారు 2016, 2018 జాతరల సందర్భంగా  రూ.230 కోట్లు శాంక్షన్​ చేసింది.   2020 మహా జాతర కోసం అన్నీ ప్రభుత్వ శాఖలకు కలిపి రూ.75 కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్​లో రూ.75 కోట్ల టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ఆర్‌‌అండ్‌‌బీ, ఆర్‌‌డబ్ల్యుఎస్‌‌, పంచాయతీరాజ్‌‌, మైనర్ ఇరిగేషన్,  ట్రైబల్​ వెల్ఫేర్ ​శాఖల ద్వారా  200కు పైగా పనులు చేపట్టారు. పాత బీటీ రోడ్లను రిపేరు చేశారు. కొత్తగా 8 లక్షల లీటర్ల కెపాసిటీతో  3 వాటర్‌‌ ట్యాంక్‌‌లు, 20 వేల మందికి పైగా భక్తులు ఉండటానికి వీలుగా 5 పెద్ద షెడ్లను నిర్మించారు. చిలుకల గుట్ట వైపు, రెడ్డిగూడెం ప్రాంతాలలో సీసీ రోడ్లు  నిర్మించారు.

ఆర్​ అండ్​బీ  ద్వారా రూ.8.05 కోట్లు, పంచాయతీ రాజ్‌‌శాఖ ద్వారా రూ.3.5 కోట్లు ఖర్చుచేసి మేడారానికి వచ్చే అన్నీ రోడ్లతో పాటు జాతర పరిసర ప్రాంతాల్లోని ఇంటర్నల్​ రోడ్ల రిపేర్లు చేశారు. డ్రైనేజీలను వెడెల్పు చేశారు. పనులు చేస్తున్నప్పుడే క్వాలిటీ లోపాలు కనిపించాయి. బీటీ రోడ్లపై గడ్డి మొలిచింది. తాడ్వాయి‒మేడారం, నార్లాపూర్‌‌‒మేడారం, భూపాలపల్లి‒మేడారం రోడ్లు పూర్తిగా  గుంతలమయంగా మారాయి.   బీటీ పూర్తిగా కొట్టుకుపోయింది.

సుమారు 10 వేల మంది ఉండటానికి, రాత్రిపూట పడుకోవడానికి వీలుగా రూ.2 కోట్లతో కన్నెపల్లి, మేడారంలలో 5 షెడ్లను నిర్మించారు.  జాతర ముగిసేనాటికి కూడా వీటి నిర్మాణం పూర్తికాలేదు. ప్రస్తుతం పనులు కంప్లీట్​ అయినా ఒక పెద్దగాలివాన వస్తే కొట్టుకుపోయేలా కన్పిస్తున్నాయి. నాసిరకం సిమెంట్‌ వాడడం, సరిగా క్యూరింగ్‌‌ చేయకపోవడంతో గోడలు పగుళ్లు బారాయి.

ఇరిగేషన్‌ శాఖ అధికారులు రూ.4 కోట్లతో పనులు చేపట్టారు. జంపన్నవాగులో చెక్‌‌డ్యాంలను కూల్చివేయలేదు. వాగులో ఇసుక కొట్టుకుపోయి నీటి లోతు తెల్వక చాలామంది భక్తులు చనిపోయారు.  కాజ్‌‌వేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులో నిర్మించిన 2 వంతెనలపై గ్రిల్స్‌‌ ఏర్పాటు చేయలేదు.

ట్రైబల్​ వేల్పేర్​ శాఖ రూ.4 కోట్లతో పనులు చేపట్టగా.. ఏడాది కాకముందే చిలకలగుట్టవద్ద నిర్మించిన ప్రహరి కూలిపోయింది.  గిరిజన మ్యూజియం ఎప్పుడూ మూసే ఉంటుంది. జాతర ప్రత్యేకతను వివరించేలా రూ. కోటి లతో గోడల మీద వేసిన బొమ్మలు రంగు వెలిసిపోయాయి.  రూ.4 కోట్లతో విద్యుత్‌‌ శాఖ పనులు చేపట్టగా జంపన్నవాగు వద్ద స్థంభాలు కూలి, వైర్లు తెగిపడి కన్పిస్తున్నాయి.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

మేడారం పనుల్లో నాణ్యతా లోపాలుంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. ‒ కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్‌‌.

ఇవి కూడా చదవండి

డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అడ్‌‌‌‌హాక్ ప్రమోషన్ల‌‌‌‌ గండి

పెద్ద మనసుతో మనసులు గెలిచారు

విదేశాల ​వైపు సంపన్నుల పరుగు

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు