బయోమైనింగ్​ పేరిట రూ.300 కోట్లు వృథా

బయోమైనింగ్​ పేరిట రూ.300 కోట్లు వృథా

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో చెత్తతో రూ.30 లక్షల సంపాదన
సూర్యాపేటలోనూ నెలకు రూ.20 లక్షల ఆదాయం
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వందల కోట్ల  ఖర్చు 
ఒకే కంపెనీకి 15కు పైగా కాంట్రాక్టులు
రాబడి వచ్చే మార్గమున్నా అమలుపై నిర్లక్ష్యం

పక్క రాష్ట్రాల్లో చెత్తను రీ సైక్లింగ్​ చేయడం ద్వారా మున్సిపాలిటీలు కోట్లు సంపాదిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బయోమైనింగ్​ పేరుతో ఏటా రూ.300 కోట్లు ఉల్టా ఖర్చు పెడుతోంది. మన దగ్గర సైతం సూర్యాపేట లాంటి మున్సిపాలిటీలో చాలా ఏండ్లుగా చెత్త నుంచి వర్మీ కంపోస్టు, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ ఇటుకలు, ప్లాస్టిక్ డోర్ మ్యాట్లు, చేతి సంచులను తయారు చేస్తూ నెలకు రూ.20 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఏపీలోని తిరుపతి మున్సిపాలిటీకి కేవలం చెత్త ద్వారా నెలకు రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టకుండా బయో మైనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు చేయడం, వాటిని కూడా తమకు అనుకూలమైన కాంట్రాక్ట్​ సంస్థలకు అప్పగిస్తున్న తీరుపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ టన్నుల కొద్దీ జమవుతున్న చెత్తను వదిలించుకునేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోంది. డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను లెగసీ వేస్ట్ అంటారు. దాన్ని రీసైకిల్ చేసి బయో మైనింగ్ చేసేందుకు రూ.300 కోట్లకు పైగా వృథా చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్​, నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​లలో బయో మైనింగ్ చేస్తున్నారు. త్వరలోనే దశలవారీగా మిగిలిన మున్సిపాలిటీల్లో ఈ పద్ధతి ఫాలో కానున్నారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఖమ్మంలో రెండు వారాల్లో బయో మైనింగ్ మొదలుకాబోతుండగా, వరంగల్ లో ఇప్పటికే రూ.36 కోట్లతో బయో మైనింగ్ షురూ చేశారు. గతంలో నేషనల్ గ్రీన్​ ట్రిబ్యునల్ ​ఇచ్చిన ఆదేశాల మేరకు చెత్తను తగులబెట్టడం, పూడ్చిపెట్టడంపై నిషేధం ఉంది. దీన్ని కారణంగా చూపెట్టి ఆదాయం వచ్చే మార్గాలపై వదిలి, డబ్బులిచ్చి చెత్తను వదిలించుకోవాలని చూడడంపై విమర్శలొస్తున్నాయి. 

ఖమ్మంలో 18 కోట్లు ఖర్చు..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​కు దానవాయిగూడెంలో 39 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉంది.  మున్సిపల్ అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ 2.70 లక్షల మెట్రిక్​ టన్నుల చెత్త ఉంది. 10 ఫీట్ల లోతులో  పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్​ ద్వారా బాధ్యతను అప్పగించారు. ఈ కంపెనీ రెండేండ్లలో మొత్తం పాత చెత్తను తొలగించి, జీరో లెవెల్ ​వరకు చేసి ల్యాండ్​ను మున్సిపల్ కార్పొరేషన్​ కు అప్పగించాల్సి ఉంటుంది. దీని కోసం ఆ కంపెనీకి టన్నుకు రూ.510 చొప్పున చెల్లించనున్నారు. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ డ్రోన్​ ద్వారా సర్వే చేయగా,  3.50 లక్షల మెట్రిక్​ టన్నుల చెత్త ఉందని తేలింది. దీని ద్వారా ఈ కాంట్రాక్టు విలువ రూ.18 కోట్ల వరకు ఉంటుందని ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.  

బయో మైనింగ్ అంటే... 
డంపింగ్ యార్డుల్లో భారీగా పేరుకుపోయిన చెత్తను మెషీన్ల ద్వారా శుద్ధి చేసి, రీసైకిల్ చేయడాన్ని బయో మైనింగ్ అంటారు. 100 ఎంఎం కంటే ఎక్కువ పరిమాణం ఉన్న వ్యర్థాలు అంటే పెద్ద ప్లాస్టిక్​బాటిళ్లు, కొబ్బరిబోండాలు, రాళ్లు, బట్టల వంటివి, ప్లాస్టిక్​ మెటీరియల్​లోనూ రీ సైక్లింగ్ చేయగలిగినవి, రీ సైక్లింగ్ చేయలేనివి వివిధ దశల్లో బయటకు వస్తాయి. గ్లాస్​ను కూడా ఫర్నేస్​లో వేసి రీసైకిల్ చేస్తారు. అన్నీ వేర్వేరు చేయగా వచ్చిన మెటీరియల్​ను.. వర్మీ కంపోస్ట్ గా మార్చగలిగే మెన్యూర్​ను పార్కుల్లోని మొక్కలకు, డివైడర్లలోని మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తారు. మిగిలిన రాళ్లను లో లెవెల్​ఏరియాను కప్పిపెట్టడానికి వాడతారు. ప్లాస్టిక్​వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే కంపెనీలకు అమ్మేస్తారు. ఇలా ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆయా డంప్​ యార్డుల్లోని చెత్తను ఖాళీ చేసి, రెండేండ్లలో చెత్త రహితంగా తయారుచేసి అప్పగించాలి. దీని కోసం కొన్ని చోట్ల మెట్రిక్​ టన్నుకు రూ.510 చొప్పున, మరికొన్ని చోట్ల టన్నుకు రూ.570 చొప్పున ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. దీని కోసం స్వచ్ఛ భారత్ ఫండ్స్​ను ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. 

క్యూబ్​ సంస్థకు టెండర్లలో దక్కిన మున్సిపాలిటీలు
రాష్ట్ర స్థాయిలో  సీడీఎంఏ అధికారులు కొద్ది నెలల క్రితం బయో మైనింగ్ కోసం టెండర్లు నిర్వహించింది. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​, నిజామాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీలను క్యూబ్​ బయో మైనింగ్ సంస్థ మెట్రిక్​ టన్నుకు రూ.510 రేటు చొప్పున దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్​ జిల్లాల్లోని మున్సిపాలిటీలను హర్షిత బయో మైనింగ్ కంపెనీ రూ.570 చొప్పున దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

ఆదాయం వచ్చే మార్గమున్నా అదనపు ఖర్చు 
సూర్యాపేట మున్సిపాలిటీలో చాలా ఏండ్ల నుంచి తడిచెత్త, పొడి చెత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. చెత్త నుంచి వర్మీ కంపోస్టు, ప్లాస్టిక్​ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్​ ఇటుకలు, ప్లాస్టిక్​ డోర్ మ్యాట్లు, చేతి సంచులను తయారు చేస్తున్నారు. దీని ద్వారా మున్సిపాలిటీకి నెలకు దాదాపు రూ.20 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ విధానం అమలుకు ఇటీవల రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట మున్సిపాలిటీ అవార్డును కూడా అందుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి మున్సిపాలిటీలో డ్రైవేస్ట్​ ప్లాంట్ ను ఏర్పాటుచేశారు. తడిచెత్త నుంచి బయోగ్యాస్​, సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పొడి చెత్తను టిప్పర్లలోనే కాంటా పెట్టి టన్నుకు రూ.2వేల చొప్పున బెంగళూరుకు చెందిన కంపెనీ కొనుక్కుంటోంది. దీని ద్వారా నెలకు రూ.30 లక్షల వరకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తోంది. ఇలా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టకుండా బయో మైనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు చేయడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.