జై జై OTT : బయట రూ.60 పెప్సీ.. మల్టీఫ్లెక్స్ లో రూ.360

జై జై OTT : బయట రూ.60 పెప్సీ.. మల్టీఫ్లెక్స్ లో రూ.360

యాపారం అంటే 20, 30 రూపాయిలు లాభం చూసుకోవచ్చు.. మరీ టూ మచ్ రేట్లు అంటే మాత్రం భరించటం కష్టమే.. బయట షాపులో 60 రూపాయలు పెప్సీని.. 360 రూపాయలకు అమ్మితే.. అమ్మో అని నోరెళ్లబెట్టరా.. ఢిల్లీలోని ఓ మల్టీఫెక్స్ కు వెళ్లిన ఫ్యామిలీకి ఇలాంటి షాకే తగిలింది. 600 ఎంఎల్ పెప్సీకి.. 360 రూపాయలు వసూలు చేశారు. తీసుకున్న తర్వాత వద్దని చెప్పలేరు కదా.. చచ్చినట్లు బిల్లు కట్టి.. కోపం, కసితో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే నెటిజన్లు బీభత్సంగా రియాక్ట్ అయ్యారు. అందుకే కదా ధియేటర్లకు వెళ్లటం మానేశాం.. ఓటీటీలకు జై కొడుతుంది అందుకే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మల్టీఫ్లెక్సుల్లో టికెట్ ధరల కంటే స్నాక్స్, కూల్ డ్రింక్స్  దోపిడీకి భయపడి వెళ్లటం లేదని మధ్య తరగతి ఫ్యామిలీస్ చెప్పటం విశేషం..

మనలో చాలా మందికి సినిమా థియేటర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సినిమాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాం. కానీ మహమ్మారి రాకతో సినిమా థియేటర్లలో సందడి తగ్గింది. ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ల హవా పెరిగింది. కోవిడ్‌కు ముందు తమకు నచ్చిన అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసిన సినీ లవర్స్‌ ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం థియేటర్‌లో సినిమా చూడడం ఖర్చుతో కూడుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు..   

సినిమా టిక్కెట్ల కోసం ఖర్చుతో పాటు స్నాక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ధరలతో సినీ ప్రేక్షకుల జేబుకు చిల్లు పడుతుందని వాపోయాడు ఓ నెటిజన్‌. ఓ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన తనకు పాప్‌ కార్న్‌ బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.  ఇటీవల ట్విటర్‌ యూజర్ త్రిదీప్ కె మండల్ నోయిడాలోని పీవీఆర్‌ సినిమాస్‌లో సినిమా చూశాడు. అందుకు అతనికైన ఖర్చు అక్షరాల రూ.820.  ఇంకా సినిమా టికెట్‌ ధర వేరే ఉంది. పాప్‌కార్న్ ధర రూ.460, కూల్‌డ్రింక్‌కి రూ. 360కి చెల్లించాల్సి వస్తుందంటూ ఆ బిల్లును ట్విటర్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు, ఒక్క సినిమా కోసం నేను ఖర్చు చేసిన మొత్తం ధరతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌  చెల్లిస్తే  కావాల్సినన్ని సినిమాల్ని చూడొచ్చు. అందుకే ప్రజలు థియేటర్‌లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్ట పడడం లేదు అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌ను 1.2 మిలియన్లకు పైగా వీక్షించగా, 18 వేల  లైక్‌ లు వచ్చాయి. 

ALSO READ:మొన్న ఢిల్లీ, ఇవాళ బెంగళూరు రేపు హైదరాబాద్ .. మెట్రోలోనూ మందు తీసుకెళ్లొచ్చా?!

తినడానికి కాదుగా

దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా థియేటర్‌లలో అధిక ధరల్ని ఎలా భరించగలం? సినీ లవర్స్‌ థియేటర్లకు వెళ్లకుండా మానుకోవడంలో ఆశ్చర్యం లేదని ఓ నెటిజన్‌ చేయగా.. పాప్‌కార్న్‌ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఇంటికెళ్లి భోజనం చేయండి అంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ ఈ అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది.