ఊట్కూరు, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో జరిగిన రూ.3.91 కోట్ల అవకతవకలకు పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మక్తల్ సీఐ రాంలాల్ ఊట్కూరులో మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మక్తల్, ఊట్కూరు మండలాలకు చెందిన రైతులు, మృతి చెందినవారు, ఇతరుల పేర్ల మీద బ్యాంక్ సిబ్బంది, కొందరు మధ్యవర్తులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించారన్నారు. వీటి ఆధారంగా బ్యాంకులో రూ.3.91 కోట్ల రుణాలు వారి పేర్ల మీద తీసుకున్నారని తెలిపారు.
ఈ రుణాల రికవరీ కోసం బ్యాంక్ అధికారులు రైతులు, ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లగా అక్రమాలు బయట పడ్డాయని చెప్పారు. చనిపోయిన వారి పేర్ల మీద, భూమి లేని వారి పేర్ల మీద రుణాలు తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. దీనిపై బ్యాంక్ ఉన్నతాధికారులు కంప్లైంట్ చేయగా విచారణ చేపట్టామని తెలిపారు. గతంలో మేనేజర్‌గా పని చేసిన ఎస్ఆర్ నాగరాజు, అప్పటి క్యాషియర్ మంత నరేశ్, తిప్రాస్‌పల్లి గ్రామానికి చెందిన పూడూరు సత్యనారాయణ, పెద్దపొర్ల గ్రామానికి చెందిన మలీ పటేల్ సోమిరెడ్డి, మక్తల్ మండలం దండు గ్రామానికి చెందిన జి.కుర్మిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.
