పెండింగ్లో ఎంపీడీవోల వెహికల్ అలవెన్స్!

పెండింగ్లో ఎంపీడీవోల వెహికల్ అలవెన్స్!
  • 24 నెలలుగా అందని బిల్లులు
  • ఒక్కొక్క ఎంపీడీవోకు నెలకు రూ.32 వేలు ఇస్తున్న సర్కారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది ఎంపీడీవోలకు 41 కోట్లపైనే బిల్లులు పెండింగ్ 


హైదరాబాద్, వెలుగు: గ్రామ సభలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ఎంపీడీవోలు గ్రామాల్లో పర్యటించేందుకు ప్రభుత్వం వారికి వెహికల్ అలవెన్స్ చెల్లిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 540 మంది ఎంపీడీవోలు ఉన్నారు. ఒక్కో ఎంపీడీవోకు  ప్రతినెలా రూ.32 వేల చొప్పున అందజేస్తున్నది. అయితే, గత 24 నెలలుగా వాహన అలవెన్స్​ విడుదల చేయకపోవడంతో ఎంపీడీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎంపీడీవోకు ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్​ లో ఉన్నాయని వాపోతున్నారు. 

వాహన కిరాయి కింద ఒక్కో ఎంపీడీవోకు ప్రతినెల రూ.32 వేల చొప్పున నెలకు రూ.1.72 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. అలా 24 నెలలకు కలిపి సుమారు రూ.41.47 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. అయితే,  ఎంపీడీవోల కారు అలవెన్స్‌‌‌‌ రెన్యూవల్‌‌‌‌, బిల్లుల ఫైల్‌‌‌‌ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌‌‌‌లో ఉన్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు.  

6 నెలలుగా వెహికల్స్ కు నో అప్రూవల్ 

రాష్ట్రంలో మొత్తం 540 మంది ఎంపీడీవోలు ఉన్నారు. అందులో సుమారు 200 మంది మహిళా అధికారులు ఉన్నారు. వీరంతా తమ సిబ్బందితో కలిసి రోజూ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, ఉపాధి పనులను పర్యవేక్షిస్తారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఎంపీడీవోల వాహన అలవెన్స్‌‌‌‌ ప్రక్రియను ఉన్నతాధికారులు ఏటా రెన్యూవల్‌‌‌‌ చేస్తారు. అయితే, ప్రస్తుతం వాహనాల రెన్యూవల్ ​డేట్ దాటిపోయి 6 నెలలు కావొస్తున్నా.. వాహన అలవెన్స్​కు సంబంధించి అప్రూవల్ రాకపోవడంతో ఎంపీడీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొందరు ఎంపీడీవోలు సొంత వాహనంలో తిరుగుతూ బిల్లులు పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. 

ఇదే కారణంతో ప్రభుత్వం బిల్లులు ఆపుతున్నదా? లేక మరేమైనా కారణలున్నాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాహన అలవెన్స్​కు సంబంధించిన ఫైల్‌‌‌‌ను ఆర్థిక శాఖకు పంపించామని పంచాయతీరాజ్​ అధికారులు చెబుతుండగా.. అక్కడ పెండింగ్‌‌‌‌లో ఉన్నట్టు తెలిసింది.  ప్రభుత్వం స్పందించి వాహన అలవెన్స్‌‌‌‌ బిల్లులు విడుదల చేయాలని ఎంపీడీవోలు విజ్ఞప్తి చేస్తున్నారు.