రూ.45 కోట్ల సీఎమ్మార్ ఎగ్గొట్టిన్రు..మంచిర్యాల జిల్లాలో మరో రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు 

రూ.45 కోట్ల సీఎమ్మార్ ఎగ్గొట్టిన్రు..మంచిర్యాల జిల్లాలో మరో రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు 

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సీఎమ్మార్​ కోసం ఇచ్చిన వడ్లను మిల్లర్లు మాయం చేశారు. సర్కారుకు సకాలంలో బియ్యం అప్పగించకుండా, రికవరీ డబ్బులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు.   మంచిర్యాల జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల విలువైన సీఎమ్మార్​ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 23 మిల్లులపై క్రిమినల్​ కేసులు పెట్టడంతో పాటు పలు మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్​ఆర్​) యాక్టు ప్రయోగించినా మిల్లర్లు లైట్​ తీసుకుంటున్నారు.

కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని కేసుల నుంచి టెంపరరీగా రిలీఫ్​ పొందారు. ఇదిలా ఉండగా, హాజీపూర్​ మండలం నర్సింగాపూర్​లోని మరో రెండు రైస్​ మిల్లులు ఏకంగా రూ.45 కోట్ల విలువైన సీఎమ్మార్​ ఎగ్గొట్టాయి. దీంతో సదరు మిల్లులపై సివిల్​ సప్లైస్​ అధికారులు కొరడా ఝుళిపించారు. డీఎం శ్రీకళ ఫిర్యాదు మేరకు హాజీపూర్​ పోలీసుల మిల్లుల నిర్వాహకులపై క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. 

ఒక్క మిల్లులోనే రూ.30.57 కోట్లు.... 

నర్సింగాపూర్​లోని రాజరాజేశ్వర ట్రేడర్స్​కు 2022-23 యాసంగి, 2024-–25 యాసంగి, 2024-–25 వానాకాలం సీజన్లలో 13,948 మెట్రిక్​ టన్నుల వడ్లను కేటాయించారు. వీటిని మిల్లింగ్​ చేసి క్వింటాల్​కు 68 కిలోల చొప్పున 9,479 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,152 టన్నులు మాత్రమే డెలివరీ చేశారు. ఇంకా 6,327 మెట్రిక్​ టన్నుల సీఎమ్మార్​ పెండింగ్​ ఉన్నారు. దీనికి సమానమైన 9,305 మెట్రిక్​ టన్నులు ప్యాడీ మిల్లులో బ్యాలెన్స్​ ఉండాలి.

కానీ అందులోంచి 8,578.815 టన్నుల వడ్లను దుర్వినియోగం చేసినట్టు సివిల్​ సప్లైస్​ అధికారులు గుర్తించారు. పెండింగ్​ బియ్యం టన్నుకు రూ.36,448.20 చొప్పున రూ.22 కోట్ల 31 లక్షల 61వేల 693 బకాయిలుగా లెక్క తేల్చారు. దానిపై 25 శాతం పెనాల్టీ ప్లస్​ 12 పర్సెంట్​ ఇంట్రెస్ట్​ కలుపుకొని మొత్తం రూ.30 కోట్ల 57 లక్షల 31 వేల 520 రికవరీ చేయాల్సి ఉంది. దీంతో ఈ మిల్లు యజమానులు కేతిరెడ్డి మల్లారెడ్డి, గంప సంతోష్​కుమార్​లపై బీఎన్ఎస్​ 316(2), 316 (5), 318 (4), రెడ్​విత్​ 3(5) సెక్షన్ల కింద క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. 

మరో మిల్లులో రూ.15 కోట్లకు పైనే.... 

నర్సింగాపూర్​లోని శ్రీసాయి మణికంఠ ట్రేడర్స్​ సైతం అసలు, జరిమానా, వడ్డీతో కలిపి రూ.15 కోట్లకు పైగా లెక్క తేలింది. ఈ మిల్లుకు 2022–-23 యాసంగి, 2023-–24 యాసంగి సీజన్లలో 6,329 మెట్రిక్​ టన్నుల ప్యాడీ కేటాయించారు. 4,304 టన్నుల సీఎమ్మార్​కు గాను ఇప్పటివరకు 1,374 టన్నులు మాత్రమే తిరిగిచ్చారు. ఇంకా 2,929.686 మెట్రిక్​ టన్నులు పెండింగ్​ ఉన్నాయి. బ్యాలెన్స్​ ప్యాడీ 4,308 టన్నులకు గాను 4,108.127 టన్నులు దుర్వినియోగం చేసినట్టు తేలింది.

పెండింగ్​ సీఎమ్మార్​ విలువ టన్నుకు రూ.36,448.20 చొప్పున రూ.10 కోట్ల 35 లక్షల 8వేల 986 కాగా, దీనిపై 25 పర్సెంట్​ పెనాల్టీ, 12 పర్సెంట్​ ఇంట్రెస్ట్​ కలిపి మొత్తం రూ.14 కోట్ల 18 లక్షల 7వేల 312 బకాయిలు ఉన్నాయి. ఇవిగాకుండా 2021-–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన 195.868 టన్నుల బియ్యానికి రూ.68 లక్షల 19 వేల 605 పెండింగ్​ ఉన్నాయి. మిల్లు యజమాని గంప శ్రావణ్​కుమార్​పై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద కేసు ఫైల్​ చేశారు. 

మరిన్ని వార్తలు