
మహబూబ్ నగర్ జిల్లా : సౌండ్ సొల్యూషన్, పర్యావరణ రక్షణను దృష్టిలో పెట్టుకుని ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు ఆఫర్ ప్రకటించాడు. వినాయకచవితి పురస్కరించుకుని గ్రామస్థులు అందరూ కలిసి ఊరు మొత్తానికి ఒకే మట్టి విగ్రహం పెట్టుకుంటే రూ.5లక్షలు కేటాయిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
చిన్నప్పుడు ఊరి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఒకే గణేషుడిని పెట్టుకునేవారిమని.. దీంతో గ్రామస్ధులు అందరూ ఒకేచోట కలిసి భక్తి శ్రద్ధలతో భజనలు చేసేవారమని తెలిపారు ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రావాలంటే..ఊరిలో ఒకే విగ్రహం పెట్టుకోవాలని ఈ రూ.5 లక్షల బహుమతి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒకే విగ్రహం ఉన్న గ్రామాలను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే ఊరిలో ఒకే వినాయక విగ్రహం ఉన్న గ్రామానికి రూ.5లక్షలు వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే మట్టి విగ్రహాలు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ఫ్రీగా మట్టి విగ్రహాలను అందిస్తామని చెప్పారు.