ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీలో భాగంగా చిరు వ్యాపారులకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముద్ర పథకం కింద రూ.50 వేల లోపు (శిశు లోన్లు) రుణాలకు సంబంధించి రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని, ఇందుకోసం రూ.1500 కోట్లు అందిస్తామని ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేసేందుకు ప్రధాని మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను నిన్నటి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు వెల్లడిస్తున్నారు. గురువారం రెండో పార్ట్ లో భాగంగా రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులు, గిరిజనులను ఉద్దేశించి ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.50 వేల లోపు ముద్ర లోన్లు తీసుకున్న చిరు వ్యాపారులకు ఇప్పటికే మూడు నెలల మారిటోరియం ప్రకటించినట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. రూ.1.62 లక్షల కోట్ల రుణాలకు సంబంధించి చిరు వ్యాపారులకు రెండు శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు. 12 నెలల ఈఎంఐలుగా సరైన సమయంలో రుణాలను చెల్లించే వారికి ఈ రెండు శాతం రాయితీ వర్తిస్తుందని, ఇందుకోసం రూ.1500 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.
వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణాలు
కరోనా లాక్ డౌన్ కారణంగా వీధుల్లో తోపుడు బండ్లు పెట్టుకుని కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి రకరకాల వ్యాపారాలు చేసుకునేవాళ్లు తీవ్రంగా నష్టపోయారు. లాక్ డౌన్ తో వ్యాపారాలు ఆగిపోయి ఇళ్లకే పరిమితమైన వీరికి ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు మరో నెల రోజుల్లో ప్రత్యేక పథకం రూపొందించబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణ సాయం అందిస్తామన్నారు. రూ.10 వేల వరకు వర్కింగ్ కేపిటల్ అందిస్తామని చెప్పారు. డిజిటల్ పేమెంట్లను తీసుకునే వారికి రివార్డ్స్ రూపంలో ఇన్సెంటివ్ ఇస్తామన్నారు.
