గుడ్ న్యూస్: ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.700 కోట్లు ..ప్రతి సోమవారం అకౌంట్లో డబ్బులు

గుడ్ న్యూస్:  ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.700 కోట్లు  ..ప్రతి సోమవారం  అకౌంట్లో డబ్బులు
  • ఈ నెల 4న ఒక్కరోజే రూ.130 కోట్లు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించింది. ఇంటి నిర్మాణం స్టార్ట్  చేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు రూ.5 లక్షలను 4 దశల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు హౌసింగ్  కార్పొరేషన్  బదిలీ చేస్తున్నది. లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం లేట్  కాకుండా ప్రతి సోమవారం ఇండ్ల స్టేటస్ ను బట్టి అధికారులు వారి ఖాతాకు నగదు బదిలీ చేస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ  3,08,702 ఇండ్లను సాంక్షన్  చేసి బెనిఫిషరీస్ కు అందజేయగా వాటిలో 1,77,932 ఇళ్లు స్టార్ట్  అయినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం (ఈనెల 4) ఒక్కరోజే రూ.130 కోట్లను లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేశారు. ఇటీవల అన్ని జిల్లాల హౌసింగ్  ప్రాజెక్టు డైరెక్టర్లతో హౌసింగ్  సెక్రటరీ, హౌసింగ్  కార్పొరేషన్  ఎండీ వీపీ గౌతమ్  హైదరాబాద్ లో రివ్యూ చేపట్టారు. అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 

నిధుల కొరత రాకుండా ముందుకు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీం ఒకటి. ఈ స్కీంకు ఈ ఏడాది జనవరి 26 నుంచి  మొదటి విడతలో లబ్ధిదారులకు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామంలో ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. రెండో విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు పత్రాలు ఇస్తున్నారు. ఈ స్కీం వేగంగా సాగాలంటే నిధులు కొరత రానివ్వబోమని స్కీం ప్రారంభంలోనే సీఎం రేవంత్  రెడ్డి  స్పష్టం చేశారు. 

ఇందులో భాగంగా గ్రీన్  చానెల్  ద్వారా ఫండ్స్  రిలీజ్  చేస్తామన్నారు. అందుకు అనుగుణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధులు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు హడ్కో  నుంచి రూ.500 కోట్ల లోన్  వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల హౌసింగ్  బోర్డు ఓపెన్  ప్లాట్లు, రాజీవ్  స్వగృహ ఫ్లాట్లకు వేలం నిర్వహించడంతో రూ.కోట్లలో ఆదాయం వచ్చింది. దీంతో ఇందిరమ్మ స్కీమ్ కు ఎలాంటి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది.