రూ. 75 నాణెం ప్రత్యేకతలేంటి..ఇవి చెల్లుతాయా.

రూ. 75 నాణెం ప్రత్యేకతలేంటి..ఇవి చెల్లుతాయా.

ప్రత్యేక సంఘటనలు, దేశంలో జరిగిన చారిత్రక ఘట్టాలు, ప్రముఖుల జయంతులు, వర్థంతులు వంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాణేలను విడుదల చేస్తూ ఉంటుంది. అటల్ బిహారీ వాజ్‌ పేయి స్మారకంగా రూ.100 కాయిన్, ఎన్టీఆర్ శత జయంతిని  పురస్కరించుకుని రూ.100 వంటి నాణేలను, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రూ. 75 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే లాంచ్ చేసింది. తాజాగా నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 నాణేన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రూ. 75 కాయిన్ ప్రత్యేకతలు ఏంటీ...? ఈ కాయిన్ ను ఎలా పొందాలి...వంటి వివరాలు మీకోసం.

రూ.75 నాణెం ప్రత్యేకతలు

ప్రధాని మోదీ విడుదల చేసిన రూ. 75 నాణెంపై కొత్త పార్లమెంట్‌ భవనం చిత్రం ఉన్నది. దాని  పై భాగాన ‘సన్ సద్ సానుకూల్’ అని దేవనాగరి లిపిలో రాసి ఉంది. కింద భాగాన  ‘పార్లమెంట్ కాంప్లెట్స్’ అని ఇంగ్లీషులో ముద్రించారు. 44 మిల్లీ మీటర్ల వ్యాసంలో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేనికి చివర 200 వంకీలు ఉన్నాయి.  రూ. 75 నాణెం 35 గ్రాముల బరువు ఉంది. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపిన మిశ్రమంతో తయారు చేశారు.  పార్లమెంట్ కాంప్లెక్స్ కింద భాగంలో 2023 అని రాసి ఉంది. నాణేనికి రెండో వైపు భారత్ అని దేవనాగరి లిపిలోనూ.. ఇంగ్లీష్‌లో ఇండియా అని రాసి ఉంది. నాణానికి ముందు భాగంలో అశోక స్థంభం, మూడు సింహాలతో కూడిన రాజముద్ర.. దాని క్రింద దేవనాగరి లిపిలో 'సత్యమేవ్ జయతే' అని వ్రాయబడి ఉంది. నాణెం విలువను సూచిస్తూ ‘75’ సంఖ్య అడుగు భాగాన ముద్రించారు. 

రూ. 75 నాణేన్ని ఎక్కడ తీసుకోవాలి..

రూ. 75 నాణేన్ని  ముంబై , కోల్‌కతా, హైదరాబాద్‌, నోయిడాలోని ముద్రణాలయాల్లో ముద్రించారు. వీటి తయారీ ఖర్చు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నందున పరిమిత సంఖ్యలోనే రూపొందించారు. అయితే ఈ నాణేలను కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం  దేశంలోని ముద్రణాలయాలు, కొన్ని ఏజెన్సీల ద్వారా  పొందేందుకు అవకాశం ఉంది. ఆసక్తిగల వారు  Kolkata Mint, Mumbai Mint, Hyderabad Mint అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ రూ. 75 నాణేన్ని  కొనుగోలు చేసుకోవచ్చు. 

ఈ నాణేలు చెల్లుతాయా..?

ప్రధాని మోదీ విడుదల చేసిన రూ. 75 నాణెం చెల్లబాటు కాదు. స్మారక నాణెం కాబట్టి..వీటిని వినియోగించరాదు. కేవలం సేకరించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే రూ. 75 నాణేన్ని  ఎక్కువగా  నాణేలు సేకరించేవారు మాత్రమే కొంటూ ఉంటారు.