హ్యూస్టన్ : అమెరికాలోని ఓ దేవాలయంతో పాటు ఆలయ ట్రస్ట్‌పై ఇండియన్ అమెరికన్ విజయ్ దావా వేశారు. ఓ వేడుక సందర్భంగా గుడికి వెళ్లిన తన పదకొండేండ్ల కొడుకుకు వాతలు పెట్టారని మండిపడ్డారు. పిల్లాడి రెండు భుజాలపై విష్ణువు ఆకారంలో రెండు ముద్రలు వేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇందుకు రూ.8 కోట్లకు పైగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘‘టెక్సస్ షుగర్‌ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో 2023లో జరిగిన వేడుకకు నా కొడుకు వెళ్లాడు. అక్కడ పిల్లాడు వద్దన్నా వినకుండా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్లు ముద్రలు వేశారు. ఆపై కొద్దిరోజుల్లోనే విపరీతమైన నొప్పి రావడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది చెరిపివేయలేని తీవ్ర గాయం. ఇందుకు రూ.8.33 కోట్లు పరిహారంగా ఇవ్వాలి” అని విజయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.