కోటిపల్లి వాగు ఆధునీకరణకు రూ.89 కోట్లు..పరిపాలనా అనుమతులు మంజూరు

కోటిపల్లి వాగు ఆధునీకరణకు రూ.89 కోట్లు..పరిపాలనా అనుమతులు మంజూరు

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లాలోని కోటిపల్లి వాగు ఆధునికీకరణకు, పూడికతీత పనులకు రాష్ట్రసర్కారు  రూ.89.30 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్​శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. పూడికతీతకు సంబంధించి పలు గైడ్​లైన్స్​ను విధించారు. పూడిక ఎంత మేర తీయాలో శాస్త్రీయంగా అంచనా వేయాలన్నారు. ‘‘ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం, ప్రస్తుతమున్న సామర్థ్యం, పూడిక ఎంత పేరుకుపోయింది స్టడీ చేయాలి.

 ప్రతి 15 మీటర్ల దూరానికి ఎంత పూడిక వస్తున్నదో రికార్డ్ మెయింటెయిన్ చేయాలి. అందుకు క్వాలిటీ కంట్రోల్​విభాగం సిబ్బంది సాయం తీసుకోండి. ఎంత లోతు వరకు పూడికను సురక్షితంగా తీయవచ్చో అంచనా వేయాలి. నీళ్లు భూమిలోకి ఇంకకుండా చేసే గట్టి పొరను తెలుసుకుంటూ పూడికను తీయాలి. లేదంటే ప్రాజెక్ట్​బెడ్​లో నిల్వ ఉన్న నీళ్లు భూమిలోకి ఇంకే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రతి 50 నుంచి వంద మీటర్లకో ట్రెయిల్​పిట్స్(కందకాలు)ను తవ్వాలి. వెలికి తీసిన పూడికపై ప్రతి క్యూబిక్​మీటర్​కూ లెక్క ఉండాలి. అందుకు రిజిస్టర్లు నిర్వహించాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.