
రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అభ్యర్థుల ఆకాంక్షల మేరకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఒకే అభ్యర్థి ఒకే రోజు ఇన్ని పరీక్షలు ఎలా రాస్తాడని ప్రశ్నించారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను విరమించారు. పోటీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలని అన్నారు.
గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిలబస్ మార్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మారిన సిలబస్ కు ఇప్పటి వరకు మెటీరియల్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తామంతా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నామని చెప్పారు. సమస్యలపై శాంతియుతంగా పోరాడితే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సామాన్యులు, ఇతర పార్టీల నేతలు సమస్యలపై పోరాడితే మాత్రం అరెస్ట్ చేస్తారని.. మంత్రులు రోడ్లపైకి వస్తే ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం...విపక్షాలకు ఒక న్యాయమా అని నిలదీశారు. పేపర్ లీకేజీలపై వేసిన సిట్ ఇంత వరకు రిపోర్టు ఇవ్వలేదన్నారు.