TSPSC పేపర్ లీకేజీపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీపై ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సంబంధం ఉందని ఆరోపించారు. TSPSC కార్యాలయంలోని కంప్యూటర్లు హ్యాకింగ్ అయ్యే చాన్స్ ఎలా ఉందని ప్రశ్నించారు. ‘కంప్యూటర్ మీ చేతులోనే ఉండే. పాస్ వర్డు మీ దగ్గరే ఉండే. యూజర్ నేమ్ మీ వద్దే ఉండే. మళ్లీ హ్యాకింగ్ ఏంది..? మీకు తెలియకుండా ఇంకో వ్యక్తి ఎలా హ్యాక్ చేస్తడు..? రాజశేఖర్ అనే వ్యక్తి చిన్నోడు. మీకు తెలియకుండా ఎట్ల హ్యాక్ చేస్తడు. ఇందులో డైరెక్ట్ మీరే నిందితులు. మీమ్ములను ముఖ్యమంత్రి కాపాడుతున్నారంటే అందులో ఆయనకు కూడా హస్తం ఉందని అనుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కార్యాలయానికి, పేపర్ లీకేజీ ఘటనకు సంబంధం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. TSPSC ఉద్యోగుల్లో నలుగురు టాప్ టెన్ లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సిట్ కు ఇప్పటికీ సొంత బిల్డింగ్ కూడా లేదన్నారు. ‘సిట్ కేవలం ఉగ్రవాదం, తీవ్రవాదం, మత కల్లోలలు వంటి కేసుల్లోని అనుమానితులకు సమన్లు జారీ చేయడం కోసమే సిట్ ను వాడుతారు. హెల్త్ బాగోలేక విశ్రాంతి అడిగేవాళ్లే సిట్ లో ఉంటారని అని చెప్పారు. TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ కేసులో కీలక ఆధారాలను చెరిపివేసేందుకు మాట్లాడుతున్నట్లు ఉన్నాయని అన్నారు. ఈ కేసులో నిందితుడు ప్రవీణ్ కి 103 మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రవీణ్ ఓఎంఆర్ షిట్ వద్దే కుంభకోణానికి అసలు లింక్ ఉందన్నారు. పేపర్ లీకేజీ విషయంలో ప్రవీణ్ ఒక్కడే కాదని, ఇంకా చాలామంది నిందితులు ఉన్నారని ఆరోపించారు.
‘TSPSC పేపర్ లీకేజీ ఘటన రాజద్రోహం కన్నా ఘోరం. ఇది దేశద్రోహం కంటే పెద్దది. విచారణలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ 1పేపర్లు యథేచ్చగా లీకేజీ అవుతున్నాయి. నిజాలను ప్రపంచానికి ఎందుకు చెప్పడం లేదు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇచ్చే ముందు TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డికి, బోర్డు మెంబర్లకు ఇవ్వాలి. వారిని ముందుగా విచారించాలె. ముఖ్యమంత్రి కుటుంబంలో ఉండే వ్యక్తులను విచారణ చేసే దమ్ము సిట్ కు ఉందా..? ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే సిట్ నోటీసులు ఇస్తున్నారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలి. ఇప్పటికే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా విచారించాలి’ అని వ్యాఖ్యానించారు.