ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోలో తగినంత మంది ప్యాసింజర్లు దొరక్క మా జీవితాలపై ప్రభావం పడుతుందని ఆటో డ్రైవర్లు భయపడుతున్నారని.. వారిని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.  డిసెంబర్ 10వ తేదీ ఆదివారం ఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా ఉచిత బస్సు ప్రయాణంపై స్పందిస్తూ.. ఇప్పుడిప్పుడే నష్టాల్లో నుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతుందని అన్నారు. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు తెలంగాణ వచ్చినప్పటి నుండి రకరకాల కారణాల వల్ల బందుపెట్టారని.. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిందని ప్రవీణ్ కుమార్ అన్నారు.

లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారని.. ఊర్లల్లో తగిన పని దొరక్క పట్నాలకు వలస వచ్చి రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.