కొత్త ఏడాది నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ : ప్రభుత్వం

కొత్త ఏడాది నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ : ప్రభుత్వం
  •     జనవరి మొదటి వారంలోనే స్కీమ్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు
  •     హైదరాబాద్‌‌‌‌లో పైలెట్ ప్రాజెక్ట్.. ప్రారంభించనున్న మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదినుంచే రాష్ట్రంలోని అంగన్‌‌‌‌వాడీ చిన్నారులకు ఉదయం పూట బ్రేక్‌‌‌‌ఫాస్ట్ (టిఫిన్) పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంతోపాటు సెంటర్లలో అటెండెన్స్ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 

జనవరి మొదటి వారంలోనే ఈ స్కీమ్ ప్రారంభం కానుండగా.. తొలుత హైదరాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీజీ ఫుడ్స్ ద్వారా సప్లై 

అంగన్‌‌‌‌వాడీల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం, గుడ్లు, బాలామృతం అందిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెడుతున్న బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌లో నాణ్యత తగ్గకుండా టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. పిల్లలకు నచ్చేలా, ఆరోగ్యాన్నిచ్చేలా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మెనూ ప్లాన్ చేశారు. ఒక రోజు పిల్లలకు  కిచిడీ బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌గా పెడితే, మరో రోజు ఉప్మా  అందించనున్నారు. ఇలా రోజు విడిచి రోజు వేర్వేరు టిఫిన్స్‌‌‌‌ను చిన్నారులకు పెట్టనున్నారు. 

ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్రమంతటా... 

హైదరాబాద్‌‌‌‌లో అమలయ్యే పైలెట్ ప్రాజెక్ట్ రిజల్ట్‌‌‌‌ను బట్టి ఈ స్కీమ్‌‌‌‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. పిల్లలకు ఆహారం రుచి ఎలా అనిపిస్తుంది? అటెండెన్స్ పెరుగుతుందా? నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే  ఇతర ఇతర అంశాలపై పిల్లలు, పేరెంట్స్, అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 

ఆ తర్వాతే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోని అంగన్‌‌‌‌వాడీల్లోనూ ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌‌‌‌ను  అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా ఇప్పటికే ముగులు జిల్లాలో అంగన్‌‌‌‌వాడీ చిన్నారులకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా రోజూ 100 ఎంఎల్ పాలను అందిస్తున్నారు. అక్కడి ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌‌‌‌వాడీ పిల్లలకు పాలను కూడా అందించనున్నారు.

తొలుత హైదరాబాద్‌‌‌‌లో  15వేల మందికి లబ్ధి 

రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,781 అంగన్‌‌‌‌వాడీ సెంటర్లు ఉండగా.. 8 లక్షలకుపైగా చిన్నారులు ఉన్నారు. అయితే, ముందుగా ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌‌‌‌ను హైదరాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. జిల్లాలోని చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్.. ఈ ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 970 అంగన్‌‌‌‌వాడీ సెంటర్లను ఇందుకోసం సెలెక్ట్‌‌‌‌ చేశారు. ఆయా సెంటర్లలోని 3 నుంచి 6 ఏండ్ల వయసున్న సుమారు 15 వేల మంది చిన్నారులకు ఈ జనవరి నుంచే ఉదయాన్నే వేడివేడి టిఫిన్ అందనున్నది.