టీఎస్పీఎస్సీ పీఆర్వోగా కేటీఆర్ పనిచేస్తున్నరు

టీఎస్పీఎస్సీ పీఆర్వోగా కేటీఆర్ పనిచేస్తున్నరు

మంత్రి కేటీఆర్ టీఎస్పీఎస్సీ (TSPSC) పీఆర్వో గా వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎవరికి తెలియని సమాచారం కేటీఆర్ దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు టీఎస్పీఎస్సీ(TSPSC)లో ప్రశ్నాపత్రాలు లీక్ అవడానికి కారకులు ఎవరో జనార్థన్ రెడ్డి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరుద్యోగుల పక్షాన ఉంటారో..దొంగల పక్కన ఉంటారో తేల్చుకోవాలన్నారు.  తమపై ఎన్ని కేసులు పెట్టినా..పేపర్ లీకేజీపై కొట్లాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి(TJS) లాంటి కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని విద్యార్థులు,నిరుద్యోగుల  కోసం పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పష్టం చేశారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటం చేస్తే కేయూ విద్యార్థులపై అన్యాయంగా కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.  పేపర్ లీకేజీకి సంబంధించిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు.  ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో అనేక ప్రశ్నాపత్రాలు దొరికాయన్నారు. మరికొందరు నిందితుల ఇళ్లల్లో ప్రశ్నాపత్రాలతో పాటు జవాబులు కూడా దొరికాయని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా మళ్లీ పరీక్షలు పెడతామని కమిషన్ చైర్మెన్ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను  ప్రక్షాళన చేయాలని..దీనిపై .ముఖ్యమంత్రి వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి గవర్నర్ కు నివేదించాలని డిమాండ్ చేశారు. కమిషన్ సభ్యులు వెంటనే తప్పు ఒప్పుకొని గన్ పార్క్ వద్ద క్షమాపణ కోరి సిట్ అధికారులకు లొంగిపోవాలన్నారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై 30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశానని...అరెస్టు చేసిన కొనసాగించానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గవర్నర్ ను కలిశామని...త్వరలో ఈ అంశంపై రాష్ట్రపతికి కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు గ్రూప్ 1 పేపర్ లీకేజీ మీద ప్రత్యేక కేసు నమోదు చేయడం లేదని...కేసులు పెడితే కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం లేదన్నారు. ప్రవీణ్కు మాత్రమే 103 మార్కులే వచ్చాయని జనార్దన రెడ్డి చెబుతున్నారని..కానీ కమీషన్ ఉద్యోగులు ముగ్గురికి 100 పైగా మార్కులు వచ్చాయని వెల్లడించారు. 

సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్కు సాగునీరు రావడానికి రూ. 1891 కోట్లతో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మించుకున్నారని..కానీ అలంపూర్ నియోజకవర్గంలో 2 లక్షల ప్రజల కోసం తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడం లేదన్నారు. దీని కోసం రూ. 800 కోట్లు కేటాయించిన కేసీఆర్ ఇప్పటి వరకు రూ.  300 కోట్లు విడుదల చేశారన్నారు. .ఏప్రిల్ 9వ తేదీన అలంపూర్ చౌరస్తాలో 50 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.