- స్పీడప్ కానున్న అభివృద్ధి పనులు
- మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలకు రూ.164 కోట్లు మంజూరు
- పనుల గుర్తింపు పూర్తి
- ఆమోదం రాగానే నిర్మాణాలు షురూ
కోల్‌బెల్ట్, వెలుగు: పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల కోసం యూఐడీఎఫ్(అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులను ప్రభుత్వం సాంక్షన్చేసింది. దీంతో నగరాలు, పట్టణాల్లోని ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు రాష్ట్ర సర్కార్రూ.164 కోట్లు ఫండ్స్ మంజూరుచేసింది.
వీటి ద్వారా పట్టణాలు, నగరాల్లో సీసీ, బీటీ రోడ్లు, అండర్, సైడ్ డ్రైనేజీలు, ఓపెన్ జిమ్‌లు, ప్లేగ్రౌండ్స్, చిన్నపిల్ల పార్కులు, ఆక్సిజన్పార్కులను నిర్మించనున్నారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులను రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల ఆఫీసర్లు గుర్తించి ప్రణాళికలు సైతం రెడీ చేశారు. టెండర్‌ప్రక్రియ పూర్తిచేసి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. యూఐడీఎఫ్ ప్రకటించిన నిధులను నేషనల్ హౌసింగ్బ్యాంకు సమకూర్చనుంది.
ఉన్నతస్థాయి పర్యవేక్షణలో..
మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసి తొమ్మిది నెలలు పూర్తి కాగా, ఇన్చార్జీల పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనులు చేసేందుకు యూఐడీఎఫ్ ఫండ్స్ వినియోగిస్తారు. టెండర్ల నిర్వహణ మొదలుకొని పనులు పూర్తయ్యేవరకు ఉన్నతస్థాయి ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు.
ఇప్పటికే ఆయా మున్సిపాలిటీ, నగరాల్లో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులకు సంబంధించిన అచంనాలను ప్రభుత్వానికి నివేదించారు. నిధుల కేటాయింపులో ఆయా నగర, మున్సిపాలిటీల అంచనాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో టెండర్లు ఆహ్వానించి మార్చిలోగా పనులను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్‌ను ప్రయారిటీ పనులకు మాత్రమే వినియోగించాలని సంబంధిత శాఖ నుంచి మున్సిపాలిటీలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
పనుల ప్రతిపాదనలు ఇలా..
మంచిర్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు రూ.164.1 కోట్ల యూఐడీఎఫ్ ఫండ్స్ మంజూరయ్యాయి. మంచిర్యాల కార్పొరేషన్‌కు రూ.78 కోట్లు, బెల్లంపల్లికి రూ.18.7 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీకి రూ.18.7 కోట్లు, మందమర్రికి రూ.18.7 కోట్లు, క్యాతనపల్లికి రూ.15 కోట్లు, లక్సెట్టిపేటకు రూ.15 కోట్లు, కేటాయించారు. మందమర్రి మున్సిపాలిటీలో రోడ్ల కోసం రూ.14.70 కోట్లు, డ్రైయిజీలకు రూ.2 కోట్లు, పార్కులకు రూ.కోటి చొప్పున ఊరుమందమర్రి మీని ట్యాంక్ బండ్ అభివృద్ధి, శ్రీపతినగర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించనున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 7,8,9,10 వార్డుల్లో రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణం, రూ.1.5 కోట్లతో క్యాతనపల్లి రైల్వే ఆర్వోబీకి రెండు వైపుల రహదారుల వెడల్పు, రూ.3.5 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నారు.
చెన్నూరు మున్సిపాలిటీలో రూ.13 కోట్లతో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, రూ.కోటితో కల్వర్టులు, రూ.కోటితో పార్కులు, స్వాగతతోరణం పనులకు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బెల్లంపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లోని బస్తీల్లో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌గా మారిన తర్వాత విలీన మున్సిపాలిటీ నస్పూర్తో పాటు హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలు, మంచిర్యాల మున్సిపాలిటీ కలిపి అవసరమైన చోట ప్రయారిటీ ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు యూఐడీఎఫ్ ఫండ్స్ కేటాయిస్తాం. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నం.
రైల్వే ఆర్వోబీకి రెండు వైపులా రహదారి వెడల్పు పనులు చేపడుతాం. వార్డుల్లో ప్రజల అవససరాలకు అనుగుణంగా రూ.10 కోట్లతో రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణాలకు ప్రయారిటీ ఇస్తం.- గద్దె రాజు, మున్సిపల్ కమిషనర్, క్యాతనపల్లి
