రూ.550 కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి.. ఫార్మసీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం డిమాండ్

రూ.550 కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి.. ఫార్మసీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తమ బకాయి పడ్డ రూ.550 కోట్ల ఫీజు రీయింబర్స్  మెంట్ ను వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం అధ్యక్షుడు రామదాస్, ప్రధాన కార్యదర్శి పుల్ల రమేశ్​బాబు, వైస్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 

రాష్ట్రంలో 113 ప్రైవేటు ఫార్మసీ కాలేజీలు ఉండగా, వాటిలో 70వేల మంది చదువుతున్నారని తెలిపారు. దీంట్లో 55వేల మందికి పైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్స్ కు అర్హులుగా తేలారని చెప్పారు. అయితే, గత నాలుగేండ్లుగా ఫార్మసీ కాలేజీలకు రీయింబర్స్ మెంట్ నిధులు రాకపోవడంతో, భారీగా బకాయిలు పేరుకు పోయాయని పేర్కొన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్స్ ను నేరుగా స్టూడెంట్లు, పేరెంట్స్ కు చెల్లించాలని కోరారు. కాలేజీలు ట్యూషన్ ఫీజును వసూలు చేసుకునేలా అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న రూ.550 కోట్ల బకాయిలను రెండు, మూడు విడుతల్లో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.