‘విశ్వగురు’ ప్రచారంతో దేశమేమౌతుంది.. దసరాతో RSSకు 100 ఏండ్లు పూర్తి..

‘విశ్వగురు’ ప్రచారంతో  దేశమేమౌతుంది.. దసరాతో RSSకు 100 ఏండ్లు పూర్తి..

ఈ దసరాతో ఆర్ఎస్ఎస్​కు 100 ఏండ్లు  నిండుతాయి. 1975లో  ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేవరకు ఆర్ఎస్ఎస్​గానీ, దాని అనుబంధ జనసంఘ్​గానీ చిన్న సంస్థలుగానే బతికాయి. అప్పటివరకు ప్రపంచాన్ని కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు గెల్సుకుంటాయనే స్థితి ఉండేది.  

కార్మికవర్గంలో, రైతాంగంలో, మరీ ముఖ్యంగా విద్యార్థిలోకంలో మార్క్సిజం బలమైన పునాదులు వేసుకొని ఉండేది.  తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్​లో ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలు రాడికల్​విద్యార్థి ఉద్యమాలకు నిలయాలుగా ఉండేవి.  రైట్ వింగ్​ సంఘాలు పలు ప్రయత్నాలు చేసినా విద్యార్థులను అవి ఆకర్షించేవి కావు.  

సీపీఎం, సీపీఐ, సోషలిస్ట్​లు పార్లమెంటులో, అసెంబ్లీల్లో ఒక  ప్రతిపక్ష  శక్తిగా ఉండేవి. జనసంఘ్, ఆర్ఎస్ఎస్ పండుగల చుట్టూ, గుడుల చుట్టూ, మత కొట్లాటల చుట్టూ మాత్రమే ఉండేవి. కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రచారంలో కూడా ఉండేవి.

Also Read ; గ్రామాల్లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ గేమ్ చేంజర్

1975 ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రను మరో మలుపు తిప్పింది. ఆర్ఎస్ఎస్​తో  కమ్యూనిస్టులు, సోషలిస్టులు  జైళ్లలో మిత్రులయ్యారు.  1977 ఎమర్జెన్సీ ఎత్తేసేనాటికి జనతాపార్టీ ఏర్పడి ప్రధాన శత్రువు ఇందిరాగాంధీ అనే ఆలోచనతో  77 ఎన్నికల్లో ఒక్కటయ్యారు. ఇక్కడే  ఆర్ఎస్ఎస్​కు  కొత్త జీవితం వచ్చింది. ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్​/బీజేపీ ఎదుగుతూ పోయి మండల్ ​రిజర్వేషన్ వ్యతిరేకించేందుకు మందిర్​ సమస్య ముందుకు తెచ్చింది. 

ఈ సందర్శంగా  మండల్​ రిజర్వేషన్​ అన్ని అగ్రకులాలు వ్యతిరేకించి వివిధ విధాలుగా ఆర్ఎస్ఎస్​కు  మద్దతిచ్చాయి.  క్రమంగా 1999లో  వాజ్​పేయ్​ నాయకత్వంలో అధికారంలోకి  వచ్చి ఐదు ఏండ్లు పరిపాలించి  కాంగ్రెస్​కు దీటుగా నేషనల్​ పార్టీగా  రూపొందింది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు యూపీఏ  లీడర్​గా  కాంగ్రెస్​ అధికారంలో ఉన్నా ఆర్ఎస్ఎస్​/ బీజేపీలను బలహీనపర్చలేదు.  పైగా అవి బలపడ్డాయి.

ఆర్​ఎస్​ఎస్​ విశ్వరూపం 

2014లో  మోదీని ఓబీసీ పేరుతో అధికారంలోకి తెచ్చి మొదటి ఐదేండ్లు కాస్త ఓర్పుతో పాలించింది ఆర్ఎస్ఎస్/బీజేపీ కాంబినేషన్.​  కానీ,  2019లో  మరోసారి గెలిచాక ఆర్ఎస్ఎస్​ విశ్వరూపాన్ని బయటకుతీసింది.  దాని ఎజెండాలో కొన్ని దేశంలోపల అమలుపరిస్తే  ‘విశ్వగురు’ మత ప్రచారాన్ని పశ్చిమ దేశాలతోపాటు ముస్లిందేశాల్లో కూడా మొదలు పెట్టింది.  దేశంలోపల 370 రద్దు,  కశ్మీర్​ను పూర్తిగా లొంగదీసుకోవడం, రామమందిరం కట్టడం వాటి ఎజెండా అమలుచేశాయి. 2024  ఎన్నికల వరకు ఆర్ఎస్ఎస్​/ బీజేపీలకు ప్రతిపక్షం లేకుండా పోయింది.  

రాహుల్​గాంధీ ఒంటరి పోరాటాన్ని వాళ్లు లెక్కచేయలేదు.  కానీ, 2024 ఎన్నికల్లో  రాహుల్​గాంధీ ప్రతిపక్ష నాయకుడయ్యాడు.  భవిష్యత్తులో  ఏం జరగనుందో చూడాలి. రాహుల్​  కొంత చెక్ పెట్టాడు.  2023 ఎన్నికల్లో అమెరికాలో  మళ్లీ  ట్రంప్​ గెలువడంతో ఆర్ఎస్ఎస్​/బీజేపీలకు మరో కొత్త సమస్య ఏర్పడింది.  గత  పదకొండు ఏండ్ల దేశంలో ఆధిపత్యం వచ్చిందని హిందూత్వం విశ్వగురువు కాబోతుందని ప్రచారం ప్రారంభించారు.  అందుకు యోగా ఒక ఆయుధంగా ఎన్నుకున్నారు. 

అమెరికా,  కెనడా,  ఆస్త్రేలియా,   బ్రిటన్​లలో హిందూత్వ సంస్థల్ని బలపర్చారు. ముస్లిం దేశాలలో కూడా ఎన్ఎర్ఐలను  విశ్వగురు  ప్రచారానికి  అనుకూలంగా మార్చారు.  కానీ,  ముస్లిం దేశాలలో మత నియంతలే అధికారంలో ఉన్నారు. రాజ్యాన్ని మతమయం చేసినందువల్ల ఏ ముస్లిం  దేశంలో కూడా ప్రజాస్వామ్యం బతికే దాఖలాలు లేవు. 

క్రిస్టియన్​ మతవాది ట్రంప్​ 

ట్రంప్​  మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు హ్యూస్టన్​లో జరిగిన ‘హౌదీ మోదీ’ సభను  హిందూత్వ మత ప్రచారసభగా రిపబ్లికన్లు కూడా భావించినట్టు చెబుతున్నారు. ట్రంప్​ కూడా క్రిస్టియన్​ మతవాది అనేది స్పష్టం. ఇప్పుడు ఆయన ఇండియాకు వ్యతిరేకంగా తీసుకుంటున్న అన్ని రకాల  నిర్ణయాల్లో  ఈ  విశ్వగురు ప్రచారం కూడా ఒక కారణమా అనేది పరిశీలించాలి.  

ప్రపంచం గుడ్డిది కాదు, మూగది కాదు. ప్రపంచ దేశాలు తమ మతాలను కాపాడుకోవటానికి చూస్తాయి. 1946–47 నాటికి ప్రపంచ మతాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసిన  డా. బీఆర్​ అంబేద్కర్​చాలా జాగ్రత్తగా ఆలోచించే దీన్ని సెక్యులర్​ ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దే రాజ్యాంగం రాశాడు.  

ఆసియా ఖండంలో మనం అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చాలా గౌరవప్రదంగా బతకడానికి ఇది సెక్యూలర్​ డెమోక్రసీ కావడం ప్రధానమైన కారణం. దాన్ని మతపర ప్రజాస్వామ్యంగా మార్చి హిందూత్వ శక్తి విశ్వగురువు కాబోతుందని ప్రచారం, ఆచరణ 2019 నుంచి ఎక్కువగా సాగుతోంది.  

దేశాన్ని సెక్యులరిజం కాపాడింది

నెహ్రూ, సర్దార్​ పటేల్, కామరాజ్​ నాడార్, నిజలింగప్ప,  వైబీ చవాన్​ వంటి నాయకులు మొదట్లో దేశాన్ని సెక్యులర్​ ప్రజాస్వామ్యంగా కాపాడి ప్రపంచ ఇతర మతదాడుల నుంచి దేశాన్ని కాపాడారు. కామరాజ్​ వంటి శూద్ర బలమైన నాయకులు నెహ్రూను కూడా నియంత్రించేవారు. బీజేపీలో  మోహన్​ భగవత్​ను,  మోదీని.. మతప్రచారం, ముఖ్యంగా విశ్వగురు ప్రచారం నుంచి ఆపే శూద్ర, దళిత నాయకులు ఎవ్వరూ లేరు. ఉండే అవకాశం కూడా లేదు.

 మతాల చరిత్రలో ఏనాడూ కూడా ఒక మత రాజకీయ నాయకులు మేం విశ్వగురువులం అని చెప్పుకోలేదు. వాళ్ల మతాల విలువను, సూత్రాలను ప్రచారం చేసుకున్నారు. దేశాలకు దేశాలను  ఆ మతంలోకి తెచ్చుకున్నారు. అట్లా ఎదిగినవే బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. కానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ మేం ‘విశ్వగురువులం’ అని ప్రచారం చేసుకుంటున్నారు. దీని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

పాక్​వైపు ముస్లిం దేశాలు!

1947 నుంచి దాదాపు 2014 వరకు భారత దేశంలోని ప్రభుత్వాలు మతాన్ని రాజ్యం వెలుపల ఉంచాయి కనుక ముస్లిం దేశాల్లో ఒక్క పాకిస్తాన్​లో తప్ప అంత వ్యతిరేకత ఇండియా మీద లేదు.  కానీ, 370 ఆర్టికల్​ రద్దు, కాశ్మీర్​ సమస్య, పాకిస్తాన్​ సిందూర్​  సంబంధిత యుద్ధం తర్వాత ముస్లిం దేశాలు  హిందూత్వ నుంచి ఇస్లామ్​కే ప్రమాదం ఉందని  గ్రహించినట్లు కనబడుతున్నది.  

అన్ని దేశాల్లో ఇంటెలిజెన్స్​ సంస్థలు బలంగా ఉన్నాయి. అందుకే ఆ దేశాలన్నీ పాకిస్తాన్​కు అండగా నిలబడడమే కాకుండా అన్ని దేశాలు న్యూక్లియర్​ మారణాయుధాలను సమకూర్చుకోవాలని చూస్తు న్నట్లు కనిపిస్తోంది.  అందులో భాగమే పాకిస్తాన్​– సౌదీ అరేబియా ఒక ఒడంబడికను కూడా చేసుకున్నాయి. అందులో సౌదీ కూడా న్యూక్లియర్​ బాంబులను తయారు చేసే బాట పడితే అది చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయగలదు. అందుకు తోడు ఈ మధ్య కువైట్​లోకి ఇజ్రాయెల్​ చొచ్చుకొచ్చి హమాస్​వారిపై దాడి చెయ్యడంతో ఆ దేశం కూడా ఈ అరబ్​ న్యూక్లియర్​  ఫ్యాక్ట్ లో చేరే అవకాశం ఉంది.  

మొత్తం ముస్లిం దేశాలు ఇజ్రాయెల్​తోపాటు ఇండియాను టార్గెట్​ చేసే అవకాశం ఉంది. వారి ఆయిల్​ డబ్బంతా న్యూక్లియర్​ ఆయుధాల తయారీకి మలిపే వైపు పోతే ప్రపంచయుద్ధ వాతావరణం తప్పదు.   ఈ దేశాలు అటు ఇజ్రాయెల్​ను, ఇటు ఇండియాను టార్గెట్​ చేస్తే, ఏం జరుగుతుంది?  అప్పుడు  వెస్ట్​ను  వదిలేసి పుతిన్​ శిష్యరికంలోకి పోయిన మోదీ  ప్రభుత్వం రష్యా, చైనా ఇండియాకు మద్దతిస్తాయని నమ్మితే అది భ్రమే అవుతుంది.

 ఆర్ఎస్ఎస్​/ బీజేపీలు మొదలుపెట్టిన విశ్వగురు ప్రచారం ప్రపంచదేశాలన్నిటినీ తమ
తమ మత రాజకీయ వ్యవస్థల వైపు మలిపే ప్రమాదం ఉంది.  అమెరికాలో కూడా ఆ స్థితి కనబడుతోంది. అమెరికాలో క్రిస్టియన్​ మత రివైవలిజం ట్రంప్​ టైములో తీవ్రమైంది. చార్లీ కిర్క్​ హత్య తరువాత అది మరింత బలపడుతోంది. అది ఆ దేశంలోని ముస్లింలను, హిందూత్వ శక్తులుగా భావించి ఇండియన్స్ ను​ టార్గెట్​ చేసే అవకాశం పెరుగుతుంది.

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​-