బీజేపీ, ఆరెస్సెస్లు కోరుకునేది ఏంటంటే.?

బీజేపీ, ఆరెస్సెస్లు కోరుకునేది  ఏంటంటే.?

ఆరెస్సెస్ చరిత్ర ఈనాటిది కాదు. భారతీయ సంస్కృతిని పరిరక్షించడం, హిందూ సమాజాన్ని ఏకం చేయడం, పౌరుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా.. బ్రిటిష్ పాలన కాలం నుంచి పోరాడేందుకు స్థాపితమైంది. నాటి పాలకుల వ్యతిరేక ఉద్యమంలో భాగంగా హిందువుల్లో ఐక్యతను పెంచడానికి, హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమై, వందేళ్ల ఘన చరిత్రను కూడా సాధించింది. 

సావర్కర్ ప్రతిపాదించిన హిందూత్వ సిద్ధాంతం నుంచి హిందూ జాతీయవాదం అనేది ప్రేరణ పొందింది. ఆ ప్రేరణతోనే 1925లో ఆరెస్సెస్ ఏర్పాటైంది. హిందూ జాతీయవాదం అంటే హిందూ రాజ్యాన్ని స్థాపించడమే కాక బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత, హిందువుల మధ్య ఐక్యత సాధించడమే దాని లక్ష్యం. అందుకోసం భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారి జాతీయవాద దృక్పథాలకు ఆరెస్సెస్ సిద్ధాంతాలు పూర్తి భిన్నంగా తోచాయి.  

జాతీయోద్యమ ఆశయాలు ‘స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం’ కోసం అయితే.. మరోవైపు ముస్లిం జాతీయవాదం కూడా మొదలైంది. హిందూ, ముస్లిం మతవాదులు గత చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందారు. ముమ్మరంగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండిపోయారు. ఇలాంటి మతోన్మాద నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు దోహదం చేసిన తీరును ఈ ‘బీజేపీ, ఆరెస్సెస్​లు కోరుకునేది’ పుస్తకంలో చూడొచ్చు. 

హిందూ జాతీయవాదం మూలాల నుంచి నేటి వరకు సాగిన తీరు.. ఆరెస్సెస్ ఎటువంటి పరిస్థితుల్లో.. ఎలా ఏర్పడింది? దాని ఆశయాలు, సిద్ధాంతాలు.. స్త్రీ పురుష సమానత్వం కోసం ఏం చేసింది? లాంటి ఎన్నో విషయాల్ని ఇందులో పొందుపరిచింది. వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు వివిధ వర్గాల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. స్వాతంత్ర్య పోరాటకాలంలో కూడా వివిధ భావజాలాల మధ్య పోరాటం జరిగింది. ఆ పోరాటాల నేపథ్యం నుంచి వచ్చిందే కదా మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలోని సమానత్వం అనే పదాన్ని తొలగించాలని కొందరు ప్రయత్నించారు.1915లో హిందూ మహాసభ ఏర్పడింది. అనంతరం రెండు మతవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. అవి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టాయి. దీని తర్వాత సావర్కర్ హిందూత్వ/ హిందువు అంటే ఎవరు? అనే పుస్తకాన్ని రాశారు. అది కూడా ఎంతో స్ఫూర్తినిచ్చింది.

వాస్తవానికి మనది ప్రజాస్వామిక లౌకికదేశం. ఇటీవలి కాలంలో హిందూ జాతీయవాదులు తప్పుడు ధోరణులను మన ముందుకు తెస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో భారత జాతీయవాదం అనేది రూపుదిద్దుకుంది. దీనికి ప్రతిగా హిందూ, ముస్లిం జాతీయవాదాలు రెండూ వచ్చాయి. వలస పాలనలోనే ఈ రెండింటినీ మనం చూడొచ్చు. 

గాంధీజీ నాయకత్వంలో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమమే ఆర్ఎస్ఎస్ స్థాపనకు పునాది. అగ్ర కులాలు, భూస్వామ్య శక్తులు దీన్ని ఏర్పాటు చేశాయి. తర్వాత వచ్చిన భారతీయ జనతా పార్టీ వంటి సంస్థలతో సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాలు కలిగి ఉండటం నుంచి ఆ పార్టీ రాజకీయ పరిణామాలు వాటి పర్యవసానాలు, మత సామరస్యం కోసం చేయాల్సినవన్ని కూడా ఇది వివరిస్తోంది.

- పి. రాజ్యలక్ష్మీ