టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి ఆర్ఎస్ఎస్

టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి ఆర్ఎస్ఎస్
  • 24 నుంచి విజయ్​ సంకల్ప్ శిబిర్
  • రాష్ట్రంలో తొలిసారి పెద్ద ఎత్తున కార్యక్రమం
  • వారం పాటు హైదరాబాద్​లో మోహన్ భగవత్
  • 10 వేల మంది కార్యకర్తలకు ఒకేసారి శిక్షణ
  • 300 మంది బీజేపీ ముఖ్య నేతలకు పిలుపు
  • 25న సరూర్ నగర్ స్టేడియంలో భగవత్ స్పీచ్
  • 29న శిశుమందిర్​లో సమ్మేళనానికీ సంఘ్ చీఫ్

రాష్ట్రంలో బీజేపీ బలపడేలా చేసేందుకు ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ, అమిత్ షా తెలంగాణలో పార్టీ పాగా వేసేందుకు సీరియస్ గా దృష్టిపెట్టగా దీనికి తోడ్పాటు అందించేందుకు ఇప్పుడు సంఘ్ అధినేత మోహన్ భగవత్ పని మొదలుపెట్టారు. ఈనెల 24 నుంచి దాదాపు వారం రోజుల పాటు మోహన్ భగవత్ రాష్ట్రంలోనే ఉండి సంఘ్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వెలుగు బ్యూరో: దక్షిణాదిన కర్నాటక తర్వాత తెలంగాణే టార్గెట్ అని ఆర్ఎస్ఎస్ సంకేతాలు పంపుతోంది. తెలంగాణ ప్రాంత ‘విజయ్​ సంకల్ప్ శిబిర్’ను ఈనెల 24 నుంచి 26 వరకు నగర శివారులోని భారత్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించనుంది. ఈ మూడు రోజులూ మోహన్ భగవత్ శిబిర్​లోనే ఉండనున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీనికి విజయ్​ సంకల్ప్ శిబిర్​ అని పేరుపెట్టి తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. సంఘ్​కు అనుబంధంగా 30 నుంచి 35 సంస్థలు ఉన్నాయి. వీటిలో ఏబీవీపీ, బజరంగ్​దళ్, విశ్వహిందూ పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, సేవాభారతి, సాహిత్యనికేతన్, ప్రజ్ఞాభారతి, వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్, సమాచార భారతి, ముస్లిం రాష్ట్రీయ మంచ్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ముఖ్య నేతలందరికీ శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్ఎస్ఎస్ శాఖల ముఖ్య శిక్షక్, ఆ పైస్థాయి వారందరినీ ఆహ్వానించారు. శిబిర్ కోసం భారత్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ లో ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. అలాగే ఈనెల 29న సరస్వతీ శిశుమందిర్ పాత విద్యార్థుల సమ్మేళనం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిశుమందిర్​లలో చదువుకున్నవారు దాదాపు 10 వేల మంది ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా మోహన్ భగవత్ హాజరవుతారు.

సాధారణంగా 3 లేదా 4 ఏళ్లకు ఒకసారి జిల్లా లేదా విభాగ్ స్థాయిలో హేమంత శిబిరాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది. ఈసారి శాఖ ఆ పైస్థాయి కార్యకర్తలకు 3 రోజుల పాటు ప్రాంత శిబిరం జరుగుతోంది. మన రాష్ట్రంలో ఇలా ఒకేసారి 10వేల మందికిపైగా కార్యకర్తలతో ప్రాంత శిబిరం నిర్వహించడం తొలిసారి కావడం ఆసక్తి రేపుతోంది. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు ముఖ్య శిక్షక్ వరకు ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాల సభ్యులు మూడు రోజులూ శిబిరంలోనే ఉండాలి. హాజరైన ప్రతివారు దండసహిత సంపూర్ణ గణవేష్ (ఆర్ఎస్ఎస్ యూనిఫాం)తో హాజరుకావాలి. అందరూ కిందనే పడుకోవాలి. ఎవరైనా ఆరోగ్య కారణాలతో మంచం మీద పడుకోవాల్సి ఉంటే వారికి మాత్రమే ప్రత్యేక అనుమతి ఇస్తారు. భోజనం తర్వాత ఎవరి కంచం, గ్లాసుల ను వాళ్లే కడగాలి. అంటరానితనం, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా అందరూ సమానమేనని చెప్పేందుకే శిబిరాల్లో ఇలాంటి నిబంధనలు ఉంటాయని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ శిబిరానికి దాదాపు 300 నుంచి 400 మంది బీజేపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. ఇందులో పాల్గొనే బీజేపీ లీడర్లు కూడా 3 రోజులు శిబిరంలోనే ఉండాలి. శిబిరంలో నేతలందరికీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, లక్ష్యాలపై పూర్తి అవగాహన కల్పించనున్నారు.

విజయ్‌ సంకల్ప్ శిబిర్ షెడ్యూల్

ఈనెల 24న సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఉధ్ఘాటన శిబిర్ లో 10 వేల మందికి పైగా సంఘ్ సభ్యులు పాల్గొంటారు. తర్వాత వారిని గ్రూపులుగా వేరుచేసి శిక్షణ ఇస్తారు. 25న సాయంత్రం 4 గంటలకు 10 వేల మంది కార్యకర్తలు 4 వేర్వేరు దారుల్లో పథ సంచాలన్ (రూట్ మార్చ్) చేస్తూ ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ దగ్గర కలుసుకుంటారు. అందరూ సరూర్‌నగర్ స్టేడియంలో సార్వజనికోత్సవం వేదికకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సార్వజనికోత్సవంలో భగవత్ ప్రసంగిస్తారు. ఈ సభకు సాధారణ ప్రజలు కూడా హాజరు కావచ్చని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి.

ఊరూరా సంఘ్ శాఖల ఏర్పాటే లక్ష్యం

ఆర్ఎస్ఎస్ ను 1925లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. 2025 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్న సంఘ్ దేశంలోని అన్ని ఊళ్లలో శాఖను ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. మన రాష్ట్రంలో 10వేలకు పైగా గ్రామాలుంటే దాదాపు 3,400 ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. వీటిలో 600 శాఖలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. దాదాపు 2వేల గ్రామాల్లో శాఖలు ఉన్నాయి. మిగతా గ్రామాల్లోనూ శాఖల ఏర్పాటు కార్యాచరణపై శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నారు.

సంఘం… కమలం

దక్షిణాదిలో కర్నాటక తరువాత తెలంగాణలోనే ఆర్ఎస్ఎస్, అనుబంధ విభాగాల సభ్యులు ఎక్కువగా ఉన్నారు. అయితే గతంలో ఎప్పుడూ బీజేపీ విజయానికి సంఘ్ శ్రేణులను సమర్థవంతంగా వాడుకోలేదన్న వాదన ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కొన్ని సీట్లకు, ప్రాంతాలకే పరిమితమైంది. ఎప్పుడూ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశలు లేవు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవడంతో బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్రంపై ధీమా వచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయంపై సీరియస్ గా దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలకు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా తోడైతేనే తెలంగాణలో పాగా వేయడం సాధ్యమని బీజేపీ, సంఘ్ పెద్దలు భావిస్తున్నారు. అందుకే అన్ని స్థాయిలలో సమన్వయం కోసమే విజయ సంకల్ప్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 RSS has also stepped in to strengthen the BJP in Telangana state