ఐదో రోజు 17 కేసులు, రూ.39 వేల జరిమానా..గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగుతున్న బస్సుల తనిఖీలు

ఐదో రోజు 17 కేసులు, రూ.39 వేల జరిమానా..గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగుతున్న  బస్సుల తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిబంధనలను పాటించని ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం గ్రేటర్ పరిధిలో తనిఖీలు నిర్వహించిన ఆర్టీఏ అధికారులు 17 కేసులు నమోదు చేసి రూ.39 వేల జరిమానా విధించడంతోపాటు ఒక బస్సును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ పరిధిలో కమర్షియల్ గూడ్స్ రవాణా చేస్తున్న ఒక బస్సుపై రూ.5 వేల జరిమానా విధించారు. నాగోల్ వద్ద జరిగిన తనిఖీలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సాఫ్టీలేని 8 బస్సులపై కేసు నమోదు చేసిన అధికారులు.. రూ.16 వేల జరిమానా విధించారు. 

రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన తనిఖీలో టాక్స్ చెల్లించని, మల్టీ హార్న్ కలిగిన 2 బస్సులపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో కమర్షియల్ గూడ్స్ తరలిస్తున్న 6 బస్సులపై 18 వేల జరిమానా విధించారు. అలాగే ఒక బస్సు సీజ్ చేశారు. ఐదు రోజులుగా గ్రేటర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 209 కేసులు నమోదు చేయగా,4.94 లక్షల జరిమానా, 9 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.