గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచిన్రు

గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచిన్రు
  • బండ్లు నడిపేటోళ్లపై ఆర్టీఏ ఫైన్​ల మోత 
  • 15 ఏండ్లు దాటిన వెహికల్స్​కు సీక్రెట్ గా వడ్డింపులు 
  • ఒక్క రోజు లేటైనా రూ.50 ఫైన్  
  • ఒక్కో బండికి వేలల్లో ఫీజులు 
  • చార్జీల సంగతి సీక్రెట్ గా ఉంచిన రవాణా శాఖ 
  • లబోదిబోమంటున్న వాహనదారులు

హైదరాబాద్, వెలుగు:  రవాణా శాఖ జనాలపై ఫైన్ల మోత మోగిస్తోంది. పదిహేనేండ్లు దాటిన బండ్లకు రీరిజిస్ట్రేషన్, ఫిట్​నెస్ సర్టిఫికెట్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచేసింది. 15 ఏండ్లు దాటిన తర్వాత రోజుకు రూ. 50 చొప్పున ఫైన్ వడ్డిస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దీని అమలు మొదలైంది. కొత్త రూల్స్ పేరు చెబుతూ అంతకు ముందు కట్టని వాటికి కూడా రోజుకు రూ. 50 చొప్పున బాదుతోంది. దీంతో ఒక్కో బండికి వేలల్లో ఫైన్ కట్టాల్సి వస్తోందని వాహనదారులు లబోదిబోమంటున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ గా చార్జీలు పెంచి రవాణా శాఖ దండుకుంటోందని మండిపడుతున్నారు. 

ఏప్రిల్ 1 నుంచే కొత్త చార్జీలు 
పదిహేనేండ్లు దాటిన వాహనాలపై కేంద్రం చార్జీలను పెంచింది. ఇందుకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇచ్చింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం 15 ఏండ్లు దాటిన కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదేండ్ల కోసారి రెన్యువల్ చేయించుకోవాలి. వీటితోపాటు ఎనిమిదేండ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొత్త రూల్స్ ప్రకారం బైక్ రీరిజిస్ట్రేషన్ కు రూ. 1000, ఆటోకు రూ. 2,500, కార్లు, జీపులకు రూ. 5,000 వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెంచారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రేటు కూడా భారీగా పెంచారు. టాక్సీకి రూ. వెయ్యి నుంచి 7 వేలకు, బస్సు లేదా లారీకి రూ. 1500 నుంచి రూ. 12,500 వరకూ పెంచారు.

రోజుకు రూ. 50 ఫైన్ 
కొత్త రూల్స్ ప్రకారం ఓన్ వెహికల్స్ కు రీరిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలస్యమైతే నెలకు రూ. 300 చొప్పున, వాణిజ్య వాహనాలైతే రూ. 500 చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ అయితే ఫిట్​నెస్ కు రోజుకు రూ. 50 పెనాల్టీ చెల్లించాలి. అయితే ప్రస్తుతం ఏడాది క్రితం నుంచి కట్టని పాత బండ్లకు కూడా రోజుకు రూ. 50 చొప్పున విధిస్తున్నారు. శుక్రవారం కొందరు కొత్తగా wరీరిజిస్ట్రేషన్, ఫిట్నెస్ కు అప్లికేషన్ పెట్టుకోన్నోళ్లు అమౌంట్ చూసి ఆశ్చర్యపోయారు. ఆన్ లైన్ లో ఒక్కొక్కరికి రూ. 20 వేల నుంచి రూ. 50 వేలకు పైగా బిల్ చూపించింది. కొందరు కట్టగా, మరికొందరు వెనుదిరిగారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూల్స్ అమల్లోకి వచ్చినప్పుడు అదే తేదీ తర్వాత నుంచి లేట్ అయితే లేట్ ఫీ కట్టించుకోవాలి కానీ.. గతంలో వాటికి కూడా రోజుకు రూ. 50 తీసుకోవడం ఏంటని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటన కూడా చేయలే 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పటి దాకా అలాంటి ఉత్తర్వులు బయటకు రాలేదు. దీనిపై రవాణా శాఖ మొదటి నుంచి సీక్రెసీ మెయింటైన్ చేసింది. కనీసం కొత్త చార్జీలపై ప్రకటన కూడా విడుదల చేయలేదు. అమలు చేస్తారా? లేదా? అనే విషయాన్ని కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను సంప్రదించినా ఎవరూ స్పందించలేదు. వాహనదారులకు అవగాహన కల్పించలేదు. ఇటీవల ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్ విషయమై ట్రాఫిక్ పోలీసులు జనాలకు తెలిసేలా ప్రచారం చేశారు. కానీ కొత్త రూల్స్ ను మాత్రం గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి తేవడం ఏంటని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

జనాల గోడు పట్టదా? 
పాత బండ్లకు ఫిట్నెస్ గడువు ముగిస్తే రోజుకు రూ. 50 ఫైన్ తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కానీ నిబంధనల పేరుతో ఇప్పటికే గడువు తీరిన బండ్లకు కూడా ఫైన్ వేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఇలా చేస్తున్నప్పుడు కనీసం వాహనదారులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి కదా? గతంలో మోటార్ వెహికల్ సవరణ చట్టం (చలానాల పెంపు)ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు కూడా చేస్తారో లేదో కూడా తెల్వదు. ఇప్పుడు మాత్రం రాష్ట్ర రవాణా శాఖ ఉద్దేశపూర్వకంగా, ఆదాయం కోసమే ఇట్లా సీక్రెట్ గా చార్జీలు వడ్డిస్తోంది. జనాలు ఏమైపోయినా సరే.. ఆదాయమే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. 
- దయానంద్, ఆటో యూనియన్ నేత