- సంక్రాంతికి రూ. 100 కోట్ల ఇన్కమ్
- మేడారం జాతరతో మరో రూ.200 కోట్లు రాబట్టాలని ప్లాన్
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ఆరంభంలోనే ఆర్టీసీకి డబుల్ జోష్ వచ్చింది. దీంతో నష్టాల్లో ఉన్న సంస్థకు ఈ ఏడాది కొంత వరకు కాసుల పంట పండినట్టేనని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి సుమారు రూ. 100 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 9 నుంచి 14 వరకు, ఆ తర్వాత 18, 19 తేదీల్లో నడిపిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి ఈ ఇన్కమ్ వచ్చింది. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ నెల 19న సోమవారం ఒక్క రోజే ఆర్టీసీ బస్సుల్లో దాదాపుగా 60 లక్షల మంది ప్రయాణించడం ద్వారా సంస్థకు సుమారు రూ.32 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీలో ఒక్క రోజే ఇంత ఆదాయం రావడం రికార్డు. ఇదే ఊపుతో మేడారం జాతరను కూడా ఆర్టీసీకి మంచి ఆదాయం మార్గంగా ఎంచుకోవాలని అధికారులు ప్లాన్ చేశారు.
మంగళవారం దీనిపై రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సెక్రటేరియెట్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమై.. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించడంతో పాటు ఆదాయం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సంక్రాంతికి వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. ఆ పండుగతో పొల్చుకుంటే మేడారం జాతరకుతో రెండింతల ఆదాయం రావడమే లక్ష్యంగా ప్రత్యేక బస్సులు నడపడంపై దృష్టి పెట్టారు. ఈ లెక్కన మేడారం జాతర పేరుతో మరో రూ.200 కోట్ల ఆదాయం రాబట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
