
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికులను ఆర్టీసీ నిలువు దోపిడీ చేస్తోంది. ఇతర మార్గాల నుంచి ఆదాయం సమకూర్చుకోవాల్సింది పోయి, ప్యాసింజర్స్ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తోంది. నైట్ బస్సుల్లో సాధారణ టికెట్‌పై అదనంగా చార్జీలు వేస్తోంది. బస్సు వెళ్లే రూట్లలో స్టాప్‌లు ఉన్నా టికెట్ ఇవ్వడంలేదు. మధ్య స్టాపుల్లో ఆపడంలేదు. మెయిన్ స్టాప్వరకు పూర్తి టికెట్లు తీసుకోవాల్సిందేనని కండక్టర్లు/డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు.
అట్లయితేనే ఎక్కండి..
రాత్రి పది గంటల తర్వాత హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి వివిధ మార్గాలకు వెళ్లే పలు బస్సుల్లో అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి నల్గొండకు వెళ్లే డీలక్స్ బస్సుకు 120 తీసుకోవాలి. కానీ 169 తీసుకుంటున్నారు. అదనంగా 49 వసూలు చేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే..‘ఇది స్పెషల్ బస్సు. రాత్రి సమయంలో చార్జీలు ఇలానే ఉంటయి. అట్లయితే ఎక్కండి. లేకుంటే లేదు’ అని దబాయిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
పల్లె వెలుగు బస్సులకూ..
రాత్రి వేళల్లో పల్లె వెలుగు బస్సులకు ‘స్పెషల్ బస్సు’ అని బోర్డులు పెట్టి నడిపిస్తున్నారు. వాటిలో ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇస్తున్నారు. అదే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో డీలక్స్ టికెట్లు కొడుతున్నరు. ఈ బస్సులు కూడా ఆయా రూట్లలో మధ్య స్టాపుల్లో ఆగడంలేదు. ఆయా రూట్లలో ఆపాల్సి ఉన్నా, బస్సులు ఆగవని చెప్తారు. ఒక వేళ స్టాఫుల్లో ఆగాలంటే పూర్తి టికెట్ తీసుకోవాల్సిందే. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే బస్సులో చౌటుప్పల్‌లో దిగాలంటే.. ఖమ్మం వరకు టికెట్ తీసుకోవాలని కండక్టర్లు/డ్రైవర్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు రూ.180 వరకు టికెట్ ఉండగా, హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు 35 మాత్రమే. అంటే 140 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. రాత్రిళ్లు బస్స్టాండ్లోనో, రోడ్డు పైనో ఉండలేక ప్యాసింజర్లు తప్పనిసరి పరిస్థితుల్లో వాటిలో వెళ్తున్నారు.
ఆన్‌లైన్‌లోనూ అంతే..
ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్లలోనూ దోపిడీ కొనసాగుతోంది. బస్సు బయలుదేరాక మధ్యలో బస్టాప్ ఉన్నా అక్కడి నుంచి టికెట్ ఇవ్వకుండా బస్సు ప్రారంభం నుంచే టికెట్ ఇస్తున్నారు. 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉన్నా అలాగే తీసుకుంటున్నారు. అంటే ఈ దూరం అదనంగా టికెట్ చెల్లించాల్సి వస్తోంది. ఇది కాక టికెట్‌కు రిజర్వేషన్ ఫీజు, సర్వీస్ చార్జీ సపరేటుగా వసూలు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.25 దాకా ఎక్కువ అవుతోంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి మంథనికి నలుగురు కలిసి వెళ్తే రానుపోను రూ.360 ఆన్‌లైన్ రిజర్వేషన్‌కే పోతోంది. రిజర్వేషన్ చేయకుండా నేరుగా బస్టాండ్‌లో ఎక్కుదామంటే ఎక్స్‌ప్రెస్‌లతో సహా అక్కడి బస్సులన్నీ ఆన్‌లైన్ రిజర్వేషన్‌లోనే పెట్టారు. మంథనిలో ఎక్కినా, రిజర్వ్ అవుతుండటంతో సీట్లు దొరకని పరిస్థితి. దీంతో ఎటుతిరిగి రిజర్వ్ చేసుకోవాల్సిదే. ఎంజీబీఎస్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇక టికెట్‌పై తీసుకునే సర్వీస్ చార్జీ రూ.8 ఏజెంట్‌కు వెళుతుంది. రోజుకు పది వేల మంది ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్నా ఏడాదికి మూడు కోట్ల పైనే సర్వీస్ చార్జీల ద్వారా ఆదాయం సమకూరనుంది. ఇదే సర్వీస్ చార్జీ పని ఆర్టీసీ చేస్తే మూడు కోట్ల ఇన్‌కమ్ సంస్థకే వెళ్తుందనేది పలువురి అభిప్రాయం. దీని ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కాసింత ఉపశమనం దొరుకుంతుందని అంటున్నారు.
పూర్తి టికెట్ తీసుకోమంటున్నరు
నేను ఉద్యోగరీత్యా రోజూ రాత్రి తొమ్మిది తర్వాత హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు వెళ్తాను. కానీ అప్పుడు వచ్చే ఎక్స్‌ప్రెస్ బస్సులు చౌటుప్పల్‌లో ఆగడంలేదు. ఒక వేళ ఆగినా పూర్తి టికెట్ తీసుకోవాలని అంటున్నరు. అట్లయితేనే ఎక్కమంటున్నరు. కొన్ని సందర్భాల్లో అలా టికెట్ కూడా తీసుకున్నా. దీనిపై ఆర్టీసీ స్పందించాలి.
– మారగోని శంకర్, నారాయణపురం
ఆన్‌లైన్‌లోనే తీస్కోవాలె
హైదరాబాద్ నుంచి మంథని రూట్లో బస్సులన్నీ ఆన్‌లైన్‌లో పెట్టారు. దీంతో తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. లేకుంటే బస్సు ప్రారంభం అయ్యే చోట ఎక్కినా సీట్లు దొరకవు. ఒక్కో టికెట్‌కు సుమారు 25 అదనంగా తీసుకుంటున్నారు. ఇక్కడ స్టాప్ ఉంది. కానీ టికెట్ మాత్రం మంథని నుంచే కొడ్తున్నారు.
– టి. చంద్రశేఖర్, మంథని