జిల్లాల్లో సంపూర్ణం..
హైదరాబాద్‌లో పాక్షికం
హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీ జేఏసీ శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల వద్ద కార్మికులు కనిపిస్తే అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో కొన్నిచోట్ల కార్మికులు ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే కార్మిక నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం కనిపించింది. ఇక జిల్లాల్లో వాణిజ్య సంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. రోడ్లు, బస్టాండ్లు బోసిపోయాయి. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచ్ టైంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు వాహనాలను బయటకు తీయలేదు. బస్సులు నడవకపోవడం, ప్రైవేటు వాహనాలూ పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
జిల్లాల్లో పూర్తిగా బంద్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచే అంతా బోసిపోయి కనిపించింది. వ్యాపారులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసి కార్మికులకు మద్దతు తెలిపారు. సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్, జనసేన, టీఎన్జీవోస్, లెక్చరర్ల జేఏసీ, ఓయూ స్టూడెంట్స్, న్యూడెమోక్రసీ పార్టీ, జాతీయ మాలమహానాడు, క్యాబ్స్ జేఏసీ, ఆటో యూనియన్లు, జాక్టో, టీఈఏ, కరెంట్ ఉద్యోగ, కార్మిక సంఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. శుక్రవారం నడిచిన కొన్ని విద్యాసంస్థలూ ముందే సెలవు ప్రకటించాయి.
ఆగిపోయిన బస్సులు
శనివారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఆర్టీసీ తరఫున నడుపుతున్న ప్రైవేటు, అద్దె బస్సులు కూడా తిరగలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లూ రాలేదు. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ బస్టాండ్లు బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మాత్రం బస్సులను నడిపించే ప్రయత్నం చేశారు. ఆ బస్సులకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు తమ స్టేషన్ పరిధి దాటగానే దిగిపోగా తర్వాతి స్టేషన్ పోలీసులు ఎస్కార్ట్‌గా వెళ్లారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 516 బస్సులు (5.7 శాతం) నడిచాయని అధికారులు ప్రకటించారు. శుక్రవారం 74 శాతం బస్సులు నడిచాయని చెప్పడం విశేషం. మరోవైపు ఏపీ నుంచి రావాల్సిన బస్సులనూ ఆ రాష్ట్ర ఆర్టీసీ నిలిపివేసింది. రాజధాని హైదరాబాద్‌లో మాత్రం మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా బస్సులు నడిచాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. సీటీ మధ్యలోని మాల్స్, పెట్రోల్ బంక్‌లు నడిచాయి. బంద్‌కు మద్దతుగా, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్యాబ్స్ బంద్ చేశారు. దాంతో ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అర్ధరాత్రి నుంచే అరెస్టులు
బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బస్టాండ్లు, డిపోల పరిధిలోకి వచ్చిన వారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకున్నారు. కార్మికులు అన్ని పట్టణాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, యూనియన్లు, విద్యార్థి సంఘాల నేతలు కూడా వాటిల్లో పాల్గొన్నారు. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో నిరసనల్లో పాల్గొన్న మిథానీ డిపోకు చెందిన మహిళా కండక్టర్లను కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుభవాణి అనే మహిళా కండక్టర్ మాదన్నపేట పోలీస్ స్టేషన్లో షుగర్ లెవల్స్ ఎక్కువై పడిపోయారు.
పలుచోట్ల ఉద్రిక్తత
ఆందోళనలతో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ బైపాస్ రోడ్డులో నిరసనకారులు ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బండ్లగూడ డిపో వద్ద ఆందోళనకారులు బస్సుల్లో గాలితీసి, డీజిల్ ట్యాంకర్‌ను పగలగొట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
న్యూడెమోక్రసీ నేత రంగారావు చేతివేలు కట్
బంద్‌లో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. పోలీసులు వ్యాన్‌లో ఎక్కించేటప్పుడు రెండు తలుపుల మధ్య వేలు పెట్టి నొక్కారని, దాంతో వేలు తెగిందని రంగారావు మండిపడ్డారు. ‘‘నన్ను కేసీఆర్ చంపమన్నాడా? కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇదా నాకు బహుమానం”అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బంద్ సంపూర్ణం: కార్మిక సంఘాలు
రాష్ట్రవ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. బంద్‌కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు చెప్తున్నామని, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని నేతలు ప్రకటించారు. అరెస్టులు చేసే క్రమంలో పోలీసులు భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆర్టీసీ జేఏసీ, జేఏసీ వన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కీలక నేతలు అదుపులోకి..
బంద్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం నిరసన తెలిపేందుకు జేబీఎస్‌కు వెళ్లిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను అరెస్ట్ చేసి, బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నల్లగొండలో బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చార్మినార్ వద్ద సీఎల్పీ నేత మల్లు విక్రమార్కను, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలించారు. అబిడ్స్ జీపీవో వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి, మోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసి, గోషా మహల్ పీఎస్‌కు తరలించారు. ఎంజీబీఎస్ వద్ద కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డిని, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత నంద్యాల నర్సింహారెడ్డిలను వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్‌లో ఉదయమే జేఏసీ వన్ కన్వీనర్ హనుమంతు ముదిరాజ్‌ను అరెస్టు చేశారు. జేబీఎస్ వద్ద టీటీడీపీ అధ్యక్షుడు రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు.
ఎంజీబీఎస్ ఖాళీ
ఏపీ, కర్నాటక బస్సులూ రాలే..
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ బోసిపోయింది. ఇక్కడి 75 ఫ్లాట్‌ఫారాల నుంచి నిత్యం 3,500 పైగా బస్సు సర్వీసులు రాష్ట్రంతోపాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు నడిచేవి. సమ్మె మొదలైనప్పటి నుంచి బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది. శనివారం ఉదయం కొంతసేపు కర్నాటక, ఏపీ బస్సులు కనిపించాయి. తర్వాత మొత్తం బస్సులు ఆగిపోయాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రాకపోవడంతో డిపోల్లోంచి బస్సులు బయటికి రాలేదు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఏపీ, ఇతర రాష్ట్రాల బస్సులు నడుస్తాయని భావించి వచ్చామని, కానీ అవి కూడా లేక తిప్పలు పడుతున్నామని కొందరు వాపోయారు.
నల్లబ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికుల బంద్‌కు మద్దతుగా శనివారం లంచ్ అవర్‌లో రెవెన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ ఆఫీస్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, డివిజన్, మండల ఆఫీసుల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపినట్లు రెవెన్యూ జేఏసీ నాయకులు వెల్లడించారు. నిరసన కార్యక్రమాల్లో వీఆర్‌ఏల నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు పాల్గొన్నారని, భవిష్యత్‌లోనూ ఉద్యోగులంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వంగా రవీందర్ రెడ్డి, కె. గౌతమ్ కుమార్, కె.చంద్రమోహన్, ఓ.జె.మధు, గోల్కొండ సతీశ్, రవి నాయక్, కె.విజయరావు, బానాల రాంరెడ్డి, రాజయ్య, రమేశ్ బహదూర్ పిలుపునిచ్చారు.

