త్వరలో గవర్నర్​కు ఆర్టీసీ బిల్లు

త్వరలో గవర్నర్​కు ఆర్టీసీ బిల్లు
  • లా సెక్రటరీ నుంచి ఆర్ అండ్ బీకి చేరిన బిల్లు
  • గవర్నర్  సిఫార్సులకు సమాధానాలు సిద్ధంచేస్తున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు లా సెక్రటరీ నుంచి ట్రాన్స్ పోర్ట్ ఆర్ అండ్ బీకి చేరింది. త్వరలో గవర్నర్ కు బిల్లును పంపనున్నట్లు సమాచారం. ఈ వారంలో విలీన బిల్లును గవర్నర్  ఆమోదించవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు గవర్నర్  దగ్గర పెండింగ్ లో ఉన్న ఇతర బిల్లులపైనా వివరణ ఇవ్వాలని ఈనెల 18న లీగల్  ఒపీనియన్ కోసం లా సెక్రటరీకి గవర్నర్  బిల్లును పంపారు. లా సెక్రటరీ నుంచి తాజాగా ట్రాన్స్ పోర్ట్ ఆర్ అండ్ బీకి బిల్లు చేరింది. 

ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరింది. ఆమోదం తెలిపే ముందు 10 సిఫార్సులను గవర్నర్  సూచించారు. అయితే, వాటిపై ఎలాంటి చర్చ జరపకుండా బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో గవర్నర్  ఇటీవల లీగల్ ఒపీనియన్ కోసం బిల్లును లా సెక్రటరీకి పంపారు. 

వచ్చే నెల 2న ఆర్టీసీ బోర్డు మీటింగ్ 

ఆర్టీసీ బోర్డ్  ఆఫ్  డైరెక్టర్స్ మీటింగ్ వచ్చే నెల 2న బస్ భవన్ లో జరగనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తరువాత తొలిసారి జరుగుతున్న మీటింగ్ పై పలు అంశాలను బోర్డులో చర్చించనున్నారు. ఈ ఏడాది మార్చ్ 13న ఆర్టీసీ బోర్డు మీటింగ్  జరిగింది. వచ్చే నెల 2న జరిగే మీటింగ్ లో మొత్తం 20 అంశాలు బోర్డులో ఆమోదం కోసం ఖరారు చేశామని అధికారుల చెబుతున్నారు. ఆర్టీసీ చైర్మన్, ఎండీ తో పాటు ఆర్ అండ్ బీ సెక్రటరీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ, రైల్వే, కేంద్రం నుంచి ఇద్దరు ప్రతినిధులు మొత్తం 9 మంది ఆర్టీసీ బోర్డులో ఉన్నారు. 

ఆర్టీసీలో పనిచేస్తున్న 15 మంది కన్సల్టెంట్ల సర్వీసును మరి కొంతకాలం పొడిగించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మరోవైపు పీఎఫ్ ట్రస్ట్ కు రూ.1200 కోట్లు, సీసీఎస్ కు రూ.1070 కోట్ల బకాయిలను ఆర్టీసీ చెల్లించనుంది. ఈ బకాయిలపై సీసీఎస్.. హైకోర్టులో కేసు దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశించినా ఆర్టీసీ నిధులు విడుదల చేయకపోవటంతో సీసీఎస్..  కోర్టు ధిక్కరణ కేసు వేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కానున్న నేపథ్యంలో ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందా లేక ఆర్టీసీ చెల్లిస్తుందా అన్న విషయంపై బోర్డులో చర్చించనున్నట్లు సమాచారం.