కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని కెరామేరి మండలంలోని పరందోలి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ( డిసెంబర్ 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కెరామేరి మండలంలోని పరందోలి ఘాట్ రోడ్డు దగ్గర ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
పరందోలి ఘాట్ రోడ్డు 200 మీటర్ల ఎత్తులో ఉండగా.. ప్రమాదం జరిగింది. అయితే.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన విషయాన్ని గ్రహించిన డ్రైవర్ బస్సును పత్తి చేనులోకి తీసుకెళ్లాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలవ్వగా.. పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
