తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు

ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని

సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి

చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి

సరిహద్దు వరకు బస్సులు నడపమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము

మంగళవారం మరోసారి చర్చలు జరిపే అవకాశం – పేర్నినాని

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు నడుస్తాయని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంచుతున్నామని.. తెలంగాణతో చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మంగళవారం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని పేర్నినాని పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో స్థిరపడిన వారు దసరాకు ఏపీలోని స్వస్థలాలు… బంధువుల వద్దకు వెళ్లేందుకు చూస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాల మేరకు బస్సులు నడపాలని భావించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఇంకా కుదరనందువల్ల అది సాధ్యపడలేదన్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల, గరికపాడు,వాడపల్లి, పైలాన్‌, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టు వద్ద బస్సులు ఉంటాయన్నారు. ప్రయాణికులు సరిహద్దు వద్దకు వస్తే చెక్‌పోస్టుల వద్ద విరివిగా బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. ఈ మేరకు ఆంధ్రా సరిహద్దు వరకు బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

సరిహద్దు నుంచి గ్రామాలకు చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతామని పేర్ని నాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటక, తమిళనాడుకు బస్సుల పునరుద్ధరణ ఇప్పటికే జరిగిందని, తెలంగాణలో సర్వీసులు నడిపేందుకు జూన్‌ 18 నుంచి అక్కడి అధికారులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారని మంత్రి వెల్లడించారు. కనీసం పండగ వరకైనా బస్సులు నడపాలని తెలంగాణ  అధికారులను కోరామని, వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో జాప్యమైందని మంత్రి పేర్ని నాని చెప్పారు. మంగళవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించే అవకాశముందన్నారు. టీఎస్‌ఆర్టీసీతో చర్చలు జరిపాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ లాభ నష్టాల కోసం చూడట్లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మీడియాకు తెలిపారు. ఇటీవల ఏపీలో తీసుకొచ్చిన నూతన ట్రాఫిక్‌ నిబంధనల గురించి మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ ఆంక్షలను పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై చర్యల కోసమే నిబంధనలు కఠినతరం చేశామని అన్నారు. ప్రజల రక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాలను కూడా రాజకీయం చేయడం తగదన్నారు.