
- అద్దె బస్సులకు టెండర్లు పిలవడంపై కార్మికుల పిటిషన్
- బోర్డు అనుమతి లేకుండా టెండర్లకు వెళ్లడం చట్ట విరుద్ధమని వాదన
- ఆర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేదన్న అదనపు ఏజీ
హైదరాబాద్: కార్మికులు సమ్మెలో ఉండగా.. ఆర్టీసీ యాజమాన్యం టెండర్లు పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ సింగిల్ జడ్జి ధర్మాసనం విచారణ జరిపింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకునేదుకు ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ వివరించారు. ఆర్టీసీకి బోర్డు లేదని, అందులో చర్చించి అనుమతి తీసుకోకుండా.. ఇన్ చార్జ్ ఎండీ అద్దె బస్సుల టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమని వాదించారు.
అత్యవసర పరిస్థితుల్లో బోర్డుతో పనిలేదు
సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని హైకోర్టు ధర్మాసనం చెప్పిన విషయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రస్తావించారు. అత్యవసర పరిస్థితుల్లో బోర్డుతో పనిలేకుండా నేరు ఆర్టీసీ యాజమాన్యం టెండర్లు పిలిచే అధికారం ఉంటుందని అదనపు ఏజీ వాదించారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకుంటునేందుకు ఆర్టీసీ సిద్ధమైందని చెప్పారు. ఆర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేదని అదనపు ఏజీ వాదించారు. టెండర్ల ప్రక్రియ సోమవారంతో పూర్తయిందని కోర్టుకు తిలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్ ను ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదలాయించారు. పెండింగ్ లో ఉన్న పిల్ తో పాటు దీని విచారణ కూడా జరుగతుందని సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు.