బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు

బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు

ఆర్టీసీలో కారుణ్య నియమాకాలపై గందరగోళం కొనసాగుతోంది. బ్రెడ్ విన్నర్ స్కీంలో అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తామని చెప్పిన యాజమాన్యం... కొందరిని మాత్రమే కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్నది. మెడికల్ అన్ ఫిట్ ఉద్యోగుల స్థానంలోనూ కుటుంబ సభ్యులకు కొలువులు ఇవ్వకపోవడంతో ఫ్యామిలీ గడవటం కష్టమవుతోందని కార్మికులు వాపోతున్నారు. బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని అంటున్నారు. 

ఉద్యోగులు చాలీ చాలనీ జీతాలతో..

ఆర్టీసీలో ఉద్యోగులు చాలీ చాలనీ జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొలువు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగి చనిపోయినా... వ్యాధులతో మెడికల్ అన్ ఫిట్ అయినా ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రస్తుతం 15 వందల మంది దాకా ఈ కేటగిరీలో కారుణ్య నియమాకాల కోసం ఎదురు చూస్తున్నారు. 700 మందికిపైగా మెడికల్ అన్ ఫిట్ అయిన వాళ్ల పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. పూట గడవటం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్ భవన్ కు ఎన్నిసార్లు వచ్చి కలిసినా పని కావట్లేదంటున్నారు.  

అనారోగ్యంతో పని చేయలేని పరిస్థితిలో..

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో కొత్త నోటిపికేషన్స్ లేకపోగా, కనీసం కారుణ్యనియామక పోస్టులైనా ఇస్తారని ఆశపెట్టుకున్నారు వారి కుటుంబ సభ్యులు. ఆర్టీసీలో చనిపోయినవారి కుటుంబ సభ్యుల నుంచి ఈమధ్యే కొందరిని సెలక్ట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో పని చేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికుల కుటుంబాలను పట్టించుకోలేదు. 2017లో ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ ఆర్టీసీకి ఇచ్చి... ఐదేళ్ళుగా వెయిట్ చేస్తున్నాననీ.. కొందరికి శిక్షణ ఇచ్చి కూడా కొలువులు ఇవ్వలేదన్నారు. 

కొలువులకు గ్యారంటీ కూడా లేదంటున్నారు..

బ్రెడ్ విన్నర్ కోటాలో 200 మందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో తీసుకుంటూ సర్క్యులర్ ఇచ్చారు. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి అర్హులైన వారిని అప్పుడు తీసుకుంటామని చెప్పడంపై ఆర్టీసీ యూనియన్లు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కొత్తగా కొలువు క్రియేట్ చేసి ఇస్తున్నట్టే...తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. తక్కువ జీతం ఇవ్వడమే కాకుండా... కొలువులకు గ్యారంటీ కూడా లేదంటున్నారు. చాలీ చాలని జీతాలు, అధిక పని గంటలు, యాజమాన్యం వేధింపులతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు కార్మికులు. ఈ పరిస్థితుల్లో కనీసం కారుణ్య నియమాకాలనైనా తొందరగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ట్రైనింగ్ ఇచ్చిన వారికి ఇంత వరకూ ఎందుకు కొలువులు ఇవ్వలేదని ఆర్టీసీ యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు.