ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా గండం

ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా గండం
  • పట్టించుకోని సర్కార్, మేనేజ్​మెంట్​
  • ఆర్టీసీ హాస్పిటల్ ఉన్నా ఐసోలేషన్​ వార్డుకు గతి లేదు
  • ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం శూన్యం
  • బస్సులు, ఆఫీసుల్లో కనిపించని కరోనా కంట్రోల్​ చర్యలు
  • భయం భయంగా డ్యూటీలు చేస్తున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగుకరోనాతో ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. పదుల సంఖ్యలో ఉద్యోగులకు పాజిటివ్​ వచ్చినా.. కొందరు చనిపోయినా.. పట్టించుకునే దిక్కులేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ మేనేజ్ మెంట్ చేతులెత్తేసింది. కనీసం ట్రీట్​మెంట్​ కోసం తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ లో కొవిడ్ వార్డు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో, ఆఫీసుల్లో కరోనా నియంత్రణ చర్యలు అమలు కావడం లేదు.శానిటైజర్లను కూడా అందించడం లేదు. దీంతో ఉద్యోగులు భయం భయంగా డ్యూటీ చేయాల్సి వస్తోంది.

ఒక్కరోజే ఆరుగురు మృతి

ఆర్టీసీ ఉద్యోగుల్లో కొందరికి కరోనా పాజిటివ్​ వచ్చింది. అధికారికంగానే 46 మందికి పాజిటివ్ రాగా.. 8మంది చనిపోయారు. అయితే పూర్తి వివరాలను ఆఫీసర్లు చెప్పడం లేదు. అనేక మంది లక్షణాలు కనిపించగానే హోం ఐసోలేషన్ కు వెళ్లిపోతున్నారు. అనధికారికంగా 85 మందికి పాజిటివ్​ వచ్చినట్లు, 20 మందిదాకా చనిపోయినట్లు తెలుస్తోంది. శనివారం ఒక్క రోజే ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. అయితే అధికారులు మాత్రం వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు చెబుతున్నారు.

ఆర్టీసీ హాస్పిటల్  ఉన్నా..

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా హైదరాబాద్ లోని తార్నాకలో ఆర్టీసీ హాస్పిటల్ ఉంది. అందులో 200 బెడ్స్ ఉన్నాయి. సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 1.5 లక్షల మంది ఇక్కడ సేవలు పొందుతుంటారు. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నా కరోనా వస్తే గాంధీ హాస్పిటల్​కే  వెళ్లాల్సి వస్తోందని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. ఆర్టీసీ హాస్పిటల్ లోనే కరోనా వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి, ఆర్టీసీ మేనేజ్​మెంట్​కు చాలాసార్లు వినతిపత్రాలు అందజేశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందనలేదు. సౌత్​ సెంట్రల్​ రైల్వే ముందుగానే తమ స్టాఫ్​ కోసం లాలాగూడ హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటుచేసింది. ఇటీవల కరోనా ట్రీట్​మెంట్ కూడా  ప్రారంభించింది. సింగరేణిలోనూ ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఈ తరహా చొరవ ఆర్టీసీ ఎండీ ఎందుకు తీసుకోవడంలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తార్నాక హాస్పిటల్​లో కాకపోయినా ఆర్టీసీకి చెందిన స్థలాల్లో అయినా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్​లో చాలా చోట్ల ఆర్టీసీకి స్థలాలు ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు.

కరోనా నియంత్రణ చర్యలేవి?

లాక్​డౌన్​ కారణంగా మార్చి 22 నుంచి మే 18 వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మే 19 నుంచి గ్రేటర్ హైదరాబాద్, అంతర్రాష్ట్ర సర్వీసులు మినహా జిల్లాల్లో బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆఫీసులు మాత్రం పనిచేస్తూనే ఉన్నాయి. కార్గో సర్వీసుల కోసం ఉద్యోగులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ లో పనిలేకున్నా డిపోలకు ఉద్యోగులు రావాల్సి వస్తోంది. వారు అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారికి సర్వీసులు అందిస్తున్నారు.  ఎక్కువ శాతం ఆర్టీసీ బస్సులు, ఆఫీసుల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సడలింపుల తర్వాత బస్సులు స్టార్ట్ కాగానే శానిటైజర్లు ఇచ్చారు. ఇప్పుడు బస్సుల్లో ఎక్కడా శానిటైజర్స్ కనిపించట్లేదు. డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లకు కూడా శానిటైజర్లు ఇవ్వట్లేదు. ప్రతి ట్రిప్పునకు ఒకసారి బస్సును శానిటైజ్ చేయాల్సి ఉన్నా రోజుకు ఒకటి, రెండుసార్లు కూడా చేయడంలేదని డ్రైవర్లు, కండక్టర్లు చెప్తున్నారు. బస్టాండ్లలో కూడా హ్యాండ్ వాష్ లు  పెట్టడంలేదు.

ఏపీలో ఫ్రీగా కార్పొరేట్​ ట్రీట్​మెంట్​

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకునే వారే లేకుండా పోగా.. పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారికి కరోనా సోకితే అనుమతిపొందిన కార్పొరేట్ హాస్పిటళ్లలో  ప్రభుత్వం ఫ్రీగా ట్రీట్​మెంట్  ఇప్పిస్తోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తింపజేస్తోంది.  కరోనాతో మరణిస్తే రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం అందజేస్తోంది. మన దగ్గర అలాంటి చర్యలు ఏవీ లేవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.