బతుకమ్మ, దసరా చేసుకోలె.. దీపావళి కూడా అంతేనా?

బతుకమ్మ, దసరా చేసుకోలె.. దీపావళి కూడా అంతేనా?
  • ఆర్టీసీ కార్మికులకు నేటికీ అందని సెప్టెంబర్​ జీతాలు
  • దీపావళి పండుగకూ వెలుగులు లేనట్లే!
  • అప్పులు చేసి పూట గడపాల్సిన పరిస్థితి

సెప్టెంబర్​ నెల జీతం అక్టోబర్​ 1నే రావాల్సి ఉన్నా.. 23వ తేదీకీ చేతికందక ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. పైసలు లేక కార్మికులు దసరా, బతుకమ్మ చేసుకోలేకపోయారు. జీతాలు లేక, ఉద్యోగాలు ఉంటాయో ఊడుతయో తెలియక నాలుగు రోజుల్లో వచ్చే దీపావళి పండుగ కూడా జరుపుకునే పరిస్థితి లేదని కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :

ఒకటో తారీఖున రావాల్సిన జీతం కాస్త అటో ఇటో అయితే సగటు ఉద్యోగి అల్లాడిపోతడు. అలాంటిది ఒకటి, రెండు పోయి  ఇప్పుడు 22వ తేదీ దాటె! నడుమ తెలంగాణల పెద్ద పండుగ  దసరా వచ్చి పాయె.  మరో పండుగ దీపావళి రావట్టె. చేసిన నెలకు కూడా జీతాలు ఇవ్వని సర్కారుపెద్దలు, ‘సెల్ఫ్​ డిస్మిసల్​’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆ చిన్నస్థాయి కార్మికుల గుండెలు ఆగి ఆగి కొట్టుకుంటున్నాయి.  అందరూ ఆనందోత్సాహాల నడుమ దసరా జరుపుకుంటుంటే, జీతాలు లేక, తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియక ఆర్టీసీ కార్మిక కుటుంబాలన్నీ కొండంత పండుగ పూట  పస్తులతో, కంటతడితో గడిపాయి.  పేపర్​ బిల్లు, పాలబిల్లు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు ఆగిపోవడమే కాదు, అద్దె కోసం ఇంటి ఓనరు, పిల్లల ఫీజుల కోసం స్కూల్​ ప్రిన్సిపాల్​ నుంచి ‘ఇంకెప్పుడు’ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విలవిల్లాడుతున్నాయి. నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులు కేసులు, అరెస్టులతో విరుచుకుపడుతున్న తరుణంలో త్వరలో రాబోతున్న దీపావళికైనా తమ జీవితాల్లో వెలుగులు నిండే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నాయి.

ఉద్దేశపూర్వకంగానే ఇస్తలేరా?

నిబంధనల ప్రకారం ఆర్టీసీ కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి. కానీ కొంత కాలంగా పైసలు  అడ్జస్ట్‌‌‌‌ కావడం లేదని ఐదో తేదీ వరకు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో 7వ తేదీన ఇచ్చిన దాఖలాలున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​తో ఈ నెల 5 నుంచి  కార్మికులు సమ్మె బాటపట్టారు. సెప్టెంబర్​లో యథావిధిగా విధులు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన జీతాలను సంస్థ ఈ నెల 7వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంది. కానీ 22వ తేదీ దాటినా నేటికీ జీతాలు ఇవ్వలేదు. మధ్యలో దసరా పండుగ వచ్చింది. కానీ జీతంపై ఆధారపడి బతికే కార్మికులు పండుగ సామగ్రి, పిల్లలకు కొత్తబట్టలు కొనలేకపోయారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జీతాలివ్వలేదని కార్మికులు భావించారు. విధులకు రాని కార్మికులు సెల్ఫ్​ డిస్మిస్​ అయినట్లేనని ప్రభుత్వ పెద్దలు హెచ్చరించడంతో ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియక పండుగపూట కార్మిక కుటుంబాలు ఏడుస్తూ గడిపినయ్.

21లోపు ఇస్తమని చెప్పి..

ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ  టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన  న్యాయస్థానం జీతాలు ఎందుకిస్తలేరని ప్రశ్నిస్తే  ప్రభుత్వం తరఫున లాయర్‌‌‌‌ సోమవారం (ఈ నెల 21) లోపు చెల్లిస్తామని చెప్పారు. కానీ  సోమవారం  విచారణ సందర్భంగా  జీతాలు ఇవ్వడానికి రూ.239 కోట్లు అవసరమనీ, ప్రస్తుతం తమ వద్ద  అంత డబ్బు లేదని కోర్టుకు  స్పష్టం చేశారు. దీంతో  విచారణ మళ్లీ 29కి వాయిదా పడింది.

ఇల్లు గడుసుడు కష్టమైతంది..

సెప్టెంబర్​ మొత్తం కరెక్టుగనే పని చేసినం. అక్టోబర్​ నెలల సమ్మెకు పొయినం. కానీ మాకు జీతాలు ఇయ్యలె. సర్కారు కావాలనే పైసలు లేవని చెప్తుంది. మరి ఆ నెలలో మేము  తెచ్చిన ఆదాయం ఎటువోయింది? నాకు ముగ్గురు పిల్లలు. నెలనెలా వాళ్ల స్కూల్ ఫీజులు కట్టుడు, ఇంట్లకు సామాను తెచ్చుకునుడు కష్టమైతంది. ఇన్​స్టాల్​మెంట్ల కొనుక్కున్న వాటికి  కిస్తీలు కట్టలేక అరిగోస పడుతున్నం. తెలిసినకాడ అప్పులు తెచ్చి ఇల్లు ఎల్లదీస్తున్నం. జీతాల్లేక, కొలువులు ఉంటాయో పోతయో తెల్వక బతుకమ్మ , దసరా పండుగలు చేసుకోలె. దీపావళికి కూడా మా బతుకుల్లో వెలుగు వచ్చేటట్టు కనవడుతలేదు. – సుజాత, కండక్టర్ , కరీంనగర్‍ 1– డిపో

450 కోట్లు ఎటు పోయినయ్‌‌‌‌?

కార్మికుల జీతాలకు 239 కోట్లు అవసరమని ప్రభుత్వం కోర్టుకు తప్పుడు లెక్కలు చెప్పింది. 105 కోట్లు చాలు. ఇప్పటికే అధికారులకు 14 కోట్ల జీతాలు ఇచ్చిన్రు. దీనిపై జడ్జి స్పందించాలి.  గత నెలలో 450 కోట్ల ఆదాయం వచ్చింది. అది ఎక్కడికి పోయింది?  ప్రభుత్వం జీతాలు ఇయ్యాలె. – హనుమంతు ముదిరాజ్‌‌‌‌, జేఏసీ వన్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌

సెప్టెంబర్ జీతాలు ఏమైనయ్‌‌‌‌..?

ఆర్టీసీ వద్ద 7 కోట్లే ఉన్నయని కోర్టుకు  చెప్పిన్రు. మరి సంస్థలో ఇప్పటికే ఉన్న డబ్బంతా  ఎటు పోయింది. ఎవరి ఖజానాలోకి మళ్లించిన్రు. 90శాతం బస్సులు నడుస్తున్నయంటున్నరు. మరి ఆ ఆదాయం ఎక్కడికి పోతున్నది. సెప్టెంబర్‌‌‌‌ నెల జీతాలకు  చెల్లించాల్సిన  రూ. 105 కోట్లు ఏమైనయ్‌‌‌‌. కావాలనే జీతాలు ఆపుతున్నరు. ఎన్ని రోజులు జీతాలియ్యరో చూస్తం. – అశ్వత్థామ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ-1 కన్వీనర్

దీపావళికి వెలుగుల్లేవ్​..

మావి న్యాయమైన డిమాండ్లు. ఆర్టీసీని కాపాడుకోవడం మాకే కాదు, ప్రజలకూ అవసరమే. సమ్మెకు వెళ్లామని కార్మికులందరికీ జీతాలు రాకుండా చేశారు. దసరా నాడు పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వలేకపోయాం. పండుగపూట ఇంటిల్లిపాదీ ఏడుస్తూ కూర్చున్నాం. జీతాలు ఇవ్వాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇప్పుడు దీపావళి దగ్గరకొస్తోంది. పస్తులు తప్పేలా లేవు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో నాకు, నా కుటుంబానికి ఇలాంటి రోజు వస్తుందని అనుకోలే. – నాగేందర్, ఆర్టీసీ మెకానిక్​, నారాయణపేట డిపో

సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నం

ఆర్టీసీ ప్రైవేట్​పరం కావద్దనే మేము సమ్మె చేస్తున్నం. ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే మా ఉద్యోగాలకు భద్రత ఉండదు. అదే సమయంలో చార్జీలు కంట్రోల్​లో ఉండవు. కానీ మా స్వార్థం కోసం సమ్మెకు వెళ్తున్నట్లు చూపి  జీతాలు ఆపేశారు. సెప్టెంబర్​ నెల మొత్తం పనిచేసినా పైనా ఇవ్వలేదు. దీంతో పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందిపడుతున్నాం. జీతాలు రాక బతుకమ్మ , దసరా పండుగను సంతోషంగా చేసుకోలేకపోయాం. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక లోలోపల బాధ పడుతూ పైకి మాత్రం  సంతోషంగా ఉన్నట్లు నటించాం. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఇంత అరిగోస పడుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనికరం కలగడం లేదు. ఇక దీపావళికి కూడా మాకు సంతోషం లేనట్లే! – ఎస్. రాధిక, కండక్టర్, కరీంనగర్‍ 1 డిపో

పండుగ పూట పస్తులే

మా జీతాలు నిలిపివేశారు. దసరా పూట పస్తులుండాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయోననే బాధతో గడిపాం. తెలిసినకాడల్లా అప్పులు  చేస్తున్నాం.  నాలుగు  రోజుల్లో  దీపావళి  పండుగ  వస్తుంది.  కానీ మా జీవితాల్లో  వెలుగులు నిండే పరిస్థితులు కనిపిస్తలేవు. ప్రభుత్వం కక్ష సాధింపు ఇకనైనా ఆపాలి. – తోకల బాబు, డ్రైవర్, ఖమ్మం డిపో