యూనియన్లే ఆర్టీసీని ముంచినయ్.. లేకుంటే కార్మికులకు లక్ష బోనస్ వచ్చేది

యూనియన్లే ఆర్టీసీని ముంచినయ్.. లేకుంటే కార్మికులకు లక్ష బోనస్ వచ్చేది
  • యూనియన్ల వల్ల ఆర్టీసీ మూత పడుతోంది: కేసీఆర్

హైదరాబాద్: యూనియన్లు వాటి రాజకీయాల కోసం ఆర్టీసీని ముంచాయని, కార్మికుల గొంతు కోసింది వాళ్లేనని సీఎం కైసీఆర్ మండిపడ్డారు. ఈ చిల్లర రాజకీయాలు లేకుంటే మరో రెండేళ్లలోనే కార్మికులకు లక్ష రూపాయల బోనస్ వస్తుండేదని అన్నారు. ఈ సమ్మె పూర్తిగా అర్థంలేని, దురహంకార పూరితమైనదని, కార్మికుల జీవితాలతో ఆడుకోకూడదన్న బుద్ధీ జ్ఞానం ఉన్నోడెవరూ ఈ పని చేయరని అన్నారాయన. హుజూర్ నగర్ బైపోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ వచ్చాక గురువారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

యూనియన్ల సమ్మె ఫలితంగా ఆర్టీసీ మూత పడుతోందని కేసీఆర్ చెప్పారు. యూనియన్లు, వాటి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలే దీనికి కారణమని అన్నారాయన. ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవని, కనీసం బ్యాంకులను నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ స్థితిలో సమ్మెకు అసలు అర్థం ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్. రేపు మిమ్మల్ని ఎవరు కాపాడుతారంటూ కార్మికుల్ని ప్రశ్నించారు.

కండక్టర్ల, డ్రైవర్లతో నాకేం పంచాయితీ

10 లక్షలు కిలోమీటర్ల పైగా తిరిగిన బస్సులు 2600 ఉన్నాయని, వాటిని రీప్లేస్ చేయాలని చెప్పారు కేసీఆర్. ఇందుకు వెయ్యి కోట్లు కావాలి, ఆ డబ్బు ఎవరిస్తారని ప్రశ్నిచారు. ఈ సమ్మె రిజల్ట్ పాత ఆర్టీసీ ఇక ఉండదు అని అన్నారు. యూనియన్లే సంస్థను ముంచాయన్నారు. ఈ యూనియన్లు ఉండి, గొంతెమ్మ కోర్కెలతో, ఈ చిల్లర రాజకీయాలు కొనసాగితే ఆర్టీసీ బతకదని అన్నారు కేసీఆర్. వీటితో ఆర్టీసీకి భవిష్యత్తు అనేదే ఉండదు, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఆర్టీసీ కండక్టరు, డ్రైవర్లతో తన ఏమైనా పంచాయతీ ఉంటుందా అని ప్రశ్నించారు.

యూనియన్లు లేకుంటే..

సింగరేణి కార్మికులకు మొన్ననే రెండు లక్షల బోనస్ ఇచ్చామని చెప్పారు కేసీఆర్. యూనియన్లు లేకుండా పని చేస్తే ఆర్టీసీ కార్మికులు మరో రెండేళ్లలో లక్ష బోనస్ తీసుకునేవాళ్లన్నారు. కానీ ఈ యూనియన్లు వాటి రాజకీయాల కోసం పని చేసే కార్మికులను చెడగొట్టాయన్నారాయన. వారి బుర్రలోకి లేనిపోనివి ఎక్కించి సమ్మెకు తీసుకెళ్లారని అన్నారు.