ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
  • ధర్నా చౌక్ లో ఆర్టీసీ జేఏసీ సామూహిక నిరాహార దీక్ష 

ముషీరాబాద్, వెలుగు: ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం జేఏసీ నేతలు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ.." వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి, ట్రేడ్ యూనియన్లను మళ్లీ ఏర్పాటు చేయాలి. డ్రైవర్ , కండక్టర్, గ్యారేజ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. 2013 ఆర్పీఎస్ బాండ్ బకాయిలను మిగతా కార్మికులకు వెంటనే చెల్లించాలి. 2021 వేతన సవరణను అమలు చేయాలి. బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. వివిధ కేసుల్లో అన్యాయంగా రిమూవ్ సస్పెండ్ అయిన కార్మికులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. 

రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల బకాయిలను చెల్లించాలి. వీటితో పాటు ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి. లేకుంటే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం" అని హెచ్చరించారు. కార్యక్రమంలో కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ కే యాదయ్య, సుద్దాల సురేశ్, యాదగిరితోపాటు జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు 
తదితరులు పాల్గొన్నారు.