చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం.. మనసుకు హత్తుకునే మూవీ చూశా.. అస్సలు మిస్ కావద్దు

చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం.. మనసుకు హత్తుకునే మూవీ చూశా.. అస్సలు మిస్ కావద్దు

సినిమా కథనం నచ్చితే చాలు.. ఆ వెంటనే స్పందించే వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ దర్శక ధీరుడు ఎక్కువగా చిన్న బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. భారీతనానికి మారుపేరైన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లేటెస్ట్గా ఓ చిన్న సినిమాపై  ప్రశంసల వర్షం కురిపించారు. 

శశికుమార్ మరియు సిమ్రాన్ ప్రధానపాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). ఈ మూవీలో నటించిన నటులు, తెరకెక్కించిన డైరెక్టర్ లను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పొగడ్తల్లో ముంచెత్తాడు.

“ఓ అద్భుతమైన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఇపుడే మూవీ చూశాను. హృదయాన్ని కదిలించే.. మనసుకు హత్తుకునే, చక్కిలిగింతలు పెట్టే హాస్యంతో కూడిన సినిమా ఇది. మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తిగా చూశాను. నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ గొప్ప రైటింగ్, డైరెక్షన్ అందించాడు. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. ఈ సినిమా మిస్ కావద్దు” అని రాజమౌళి X వేదికగా పోస్ట్ చేశాడు.

రాజమౌళి ప్రశంసలకు టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. "చాలా ధన్యవాదాలు రాజమౌళి సర్! మీ ట్వీట్ చాలా అద్భుతమైన ఆశ్చర్యం కలిగించింది. ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా చేసింది. మాటలకు అతీతంగా కృతజ్ఞతలు" అని అభిషన్ రాశారు.

ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడే.. తప్పకుండ ఈ సినిమా చూడాలని చెప్పాక చూడకుండా ఎలా ఉంటారు ఆడియన్స్. ఈ క్రమంలోనే తెలుగు ఆడియన్స్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. తెలుగులో ఉందా.. ఉంటే ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఒకవేళ రాకపోతే ఎప్పుడు రిలీజ్ కానుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ మే 31 నుంచి జియోహాట్‌స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M.sasikumar (@sasikumardir)

టూరిస్ట్ ఫ్యామిలీ కథ:

కోవిడ్-19 ప్రభావం తర్వాత శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడులో సెటిలయ్యే ఓ చిన్న ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ తమిళనాడులోకి అక్రమంగా ప్రవేశించిన ఈ కుటుంబం, నిరంతరం అరెస్టు బెదిరింపుల మధ్య వారు సమాజంలో కలిసిపోవడానికి ఎలా కష్టపడాల్సి వచ్చింది? ఇలాంటి వారు ఈ సమాజంతో ఎలా ఐక్యమవుతారు? అప్పటి వరకూ అంటీ ముట్టనట్లుగా ఉండే అక్కడి తోటీవాళ్లు.. ఈ కుటుంబం వచ్చిన తర్వాత వాళ్ల ప్రేమానురాగాలు ఏ విధంగా మలుచబడ్డాయి? అనేది మిగతా స్టోరీ!

కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్తో కూడిన పరిపూర్ణ సమ్మేళనం ఈ  టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమాను థియేటర్లో జనం ఎగబడి మరి చూస్తున్నారు. డైరెక్టర్ ఎంచుకున్న కథనం, మనసును హత్తుకునేలా సీన్స్, ఆధ్యంతం నవ్వులు పూయించిన వారి అమాయక నటన సినిమా విజయానికి దోహదపడ్డాయి.

'టూరిస్ట్ ఫ్యామిలీ' మే 1న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూర్య 'రెట్రో'తో పోటీ పడింది. రూ.14 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా పలు థియేటర్స్ లో మంచి ప్రదర్శన కనబరుస్తుంది.