
- మంత్రి స్పీచ్ తడబడితే మీమ్
- పబ్లిక్ తో తిట్టిస్తూ ఇన్ స్టా రీల్స్
- బేస్ లెస్ ఆరోపణలతో ట్వీట్స్
- వ్యక్తిగత పరువును బజారుకు ఈడుస్తూ పైశాచికానందం
- అడ్డు, అదుపు లేని సోషల్ మీడియా
- చర్చనీయాంశంగా మారిన కట్టడి
హైదరాబాద్: రోత రాతలు.. కారు కూతలు.. తిట్లు.. శాపనార్థాలు.. వెరసి సోషల్ మీడియా పెంట పెంట అయిపోతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. వ్యక్తిత్వ హననానికి ఒడిగడుతోంది. వందల సంఖ్యలో ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ హ్యాండిల్స్ ఇందు కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఏమీ లేకున్నా ఏదో జరిగిపోతున్నట్టు రాయడం.. దానికి కట్టుకథలు అల్లడం వీళ్ల పని. ఎవరైనా తడబడినా.. నోరు జారినా నిమిషాల వ్యవధిలో మీమ్స్ క్రియేట్ చేయడం.. ఏంటి బాబు ఏంటి బాబు అన్నవ్.. మళ్లో సారి మళ్లో సారి అనే సినిమా క్లిప్ ను యాడ్ చేయడం జనాల్లోకి వదలడం రివాజుగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన తండ్రి గురించి తాను ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో టీచర్ అని చెప్పారు.
ALSO READ | స్లీవ్లెస్ డ్రెస్ పై వెకిలి కామెంట్.. రిపోర్టర్కు దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్
ఆయన స్పీడ్ గా చెప్పడం వల్ల అది కాస్తా ఇరిగేషన్ డిపార్ట్ మెంటని అనిపిస్తోంది. దాన్ని మీమ్ గా తయారు చేసేశారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో బండి సంజయ్ తండ్రి టీచర్ అనే మీమ్ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు.. రోజూ వందల సంఖ్యలో మీమ్స్ రెడీ చేస్తున్నారు. వాటికి ఏఐని జోడించి విశృంఖలత్వానికి దిగుతున్నారు. ప్రధాని మోదీతో డ్యాన్స్ చేయిస్తున్నారు.. సీఎం పేరును ఎవరైనా మర్చిపోయినా, పలుకకున్నా మీమ్స్ రెడీ చేసి వదులుతున్నారు.
గోరంతను కొండంతగా చూపుతూ ఒక ఆనందం పొందుతున్నారు. ఆదివాసీ బిడ్డ, మారుమూల ప్రాంతం నుంచి వచ్చి మంత్రిగా ఎదిగిన సీతక్కను వదల్లేదు. ఆమెను ట్రోలింగ్ చేశారు. అంతటితో ఆగక మరో మంత్రి కొండా సురేఖ ఇంగ్లీష్ స్పీచ్ తడబడ్డా.. సీఎం స్పీచ్ లో ప్రొనౌన్సేషన్ ప్రాబ్లం వచ్చినా.. ఇంగ్లిష్ రాదు.. ఇంగ్లీష్ రాదు అనే సినిమా క్లిప్ జత చేసి వదులుతున్నారు.
ట్విట్టర్ లో వండి వార్చడం
ట్విట్టర్ అంటే మొన్నటి వరకు ఒక గౌరవప్రదమైన సోషల్ మీడియా వేదిక.. అది కూడా మనోళ్ల దెబ్బకు మాలిన్యమైపోయింది. అక్కడా చిల్లర మూకలు దూరాయి. అసలు విషయాలు రాయకుండా అడ్డమైన ఆవాజ్ లు వినిపిస్తున్నారు. తెలుగులో రాస్తాంటూ వచ్చి అడ్డమైన అభూత కల్పనలన్నీ వండి వార్చుతోంది మరో హ్యాండిల్. పబ్లిక్ వాయిస్ పేరుతో నలుగురితో తిట్టించి క్లిప్పింగ్స్ ను పోస్టు చేసేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సాధారణంగా ఒకప్పుడు ఎన్నికల సమయంలోనే జరిగేది.
అది కూడా మీ ఓటు ఎవరికి వేస్తారు.. ఎవరి పాలన బాగుంది లాంటి అభిప్రాయాలు సేకరించే వారు. కానీ మైకులు పట్టుకొని పల్లెలకు బయల్దేరి తమ అనుకూలమైన వ్యక్తుల దగ్గర వాలిపోతున్నారు. వారి ద్వారా వాయిస్ ల పేరుతో నానా రచ్చ చేసేస్తున్నారు. వాటిని ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ ఆనందిస్తున్నారు. ప్రాపగండా అనేది నిత్యకృత్యంగా మారుతోంది. అయితే ఇది అన్ని వైపుల నుంచీ జరుగుతోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అని తేడా లేకుండా ఉంటోంది.
ఫేస్ బుక్ పేజీలు, వాట్సాప్ గ్రూపుల్లో వీడియోల సర్క్యులేట్
సోషల్ మీడియా, ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్స్, వాట్సాప్ గ్రూపుల్లో క్షణాల్లో వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందుకోసం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తీసిపోని విధంగా యంత్రాంగాలు పనిచేస్తుండటం గమనార్హం. మీటింగ్ కు రాకున్నా.. మీటింగుకు వచ్చినా..? ప్రసంగించకున్నా.. ప్రసంగించినా.. ఏదో ఒకటి క్రియేట్ చేయడం దానికి ఓ స్టోరీ అల్లడం సర్క్యులేట్ చేయడం పరిపాటిగా మారింది.
నియంత్రణపైనే చర్చ
సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ అవసరమని అన్నారు. దానికి పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మధ్య ప్రదేశ్ తరహా చట్టం తీసుకు రాబోతున్నామని చెప్పారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొందరు సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నారని అన్నారు. దానిని పట్టించుకోనని వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్ హైకోర్టు సైతం వ్యక్తిత్వ హననం, మార్ఫింగ్ పై సీరియస్ గా స్పందించింది. క్రాస్ చెకింగ్ అవసరమని పేర్కొంది.
ఏఐ వచ్చాక ఇంకా ఆగమాగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన క్రమంలో పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాయిస్ ను కాపీ కొట్టి ఆయనతో తెలుగులో పాటలు పాడిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిస్ తో ఇంకా ఏదేదో క్రియేట్ చేస్తున్నారు. సినిమా నటీ నటులు డీప్ ఫేక్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ స్టార్ నటులు కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్, ప్రియాంక చోప్రాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. పొలిటికల్ లీడర్ల విషయంలోనూ ఇది జరుగుతోంది. మార్ఫింగ్ వీడియోలు చేస్తూ అనని మాటలు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి వాళ్లు మాట్లాడింది ఒకటైతే ఇక్కడ కనిపించేది, వినిపించేది మరొకటి ఉంటుంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్థంకాని పరిస్థితి నెలకొంది