తెలుగు సినీ ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరించిన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. 'శివగామి'గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. లేటెస్ట్ గా ప్రముఖ నటుడు జగపతి బాబు టాక్ షో 'జయంబు నిశ్చయంబురా'కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షోలో రమ్యకృష్ణ తన సన్నిహిత స్నేహితురాలు, దివంగత నటి సౌందర్యను (Soundarya) గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ ఇద్దరికీ అత్యంత ఆత్మీయురాలైన సౌందర్య గురించి చర్చిస్తున్నప్పుడు.. పాత జ్ఞాపకాలను తలచుకొని రమ్యకృష్ణ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.
రమ్యకృష్ణ భావోద్వేగం..
రమ్యకృష్ణ, సౌందర్య కలిసి గతంలో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో పనిచేశారు. షోలో జగపతి బాబు, రమ్యకృష్ణలకు ఉమ్మడి స్నేహితురాలి గురించి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పగానే, రమ్యకృష్ణ ముఖంలో సంతోషం కనిపించింది. కానీ, వెంటనే 1999 నాటి బ్లాక్ బస్టర్ చిత్రం 'నరసింహ' నుండి రమ్యకృష్ణ, సౌందర్య కలిసి ఉన్న క్లిప్‌ను ప్రదర్శించగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భావోద్వేగాన్ని ఆపుకోలేక కొన్ని క్షణాలు అలా ఉండిపోయారు. ఆమె బాధను గమనించిన జగపతి బాబు... మేము ఆ క్లిప్‌ను ప్లే చేశామంటే, ఈ క్షణాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన పేరు లాగే సౌందర్యకు చాలా అందమైన హృదయం ఉంది అని అన్నారు.
సౌందర్యను ఎవరూ రీప్లేస్ చేయలేరు.
సౌందర్యను మొదటిసారి 'అమ్మోరు' (Ammoru-1995) షూటింగ్‌లోనే చూశాను అని రమ్యకృష్ణ తెలిపారు. ఆ తర్వాత 'నరసింహ'తో సహా చాలా సినిమాల్లో ఆమెతో కలిసి పనిచేశాను. అప్పటినుండి, అమాయకురాలైన, నిష్కపటమైన, అందమైన సౌందర్య అంచలంచెలుగా ఎదిగి, తనను తాను తీర్చిదిద్దుకుంది. ఆమెను ఎవరూ కూడా రీప్లేస్ చేయలేరు. ఆమె చాలా మంచి మనిషి, మంచి స్నేహితురాలు అని సౌందర్యతో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ రమ్యకృష్ణ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
సౌందర్య అకాల మరణం..
1990లలో టాప్ నటిగాగుర్తింపును సొంతం చేసుకున్న సౌందర్య .. రజనీకాంత్, కమల్ హాసన్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ నాగార్జున వంటి అగ్ర హీరోలతో ఆమె పనిచేసింది. జగపతి బాబు, రమ్యకృష్ణ కూడా ఆమెతో కొన్ని హిట్ చిత్రాలలో నటించారు. నాగార్జున, రమ్యకృష్ణ నటించిన 1994లో వచ్చిన 'హలో బ్రదర్' సౌందర్యకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. 'అమ్మోరు' చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
►ALSO READ | TheFamilyManSeason 3: మోస్ట్ అవైటెడ్ ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సౌందర్య 2003 ఏప్రిల్ 27న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీఎస్ రఘును వివాహం చేసుకున్నారు. అయితే, వారి మొదటి వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు, 2004 ఏప్రిల్ 17న, కేవలం 31 ఏళ్ల వయసులోనే విమాన ప్రమాదంలో తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి ఆమె మరణించారు. ఆమె బీజేపీ తరపున ప్రచారానికి వెళుతున్నప్పుడు ఈ విషాదం జరిగింది. ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా. ఆమె అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిల్చింది.
