ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్లు, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్  కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీసీఎంఎస్​చైర్మన్ కుమ్రం మాంతయ్య, కాగజ్ నగర్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సుద్దాల దేవయ్య, కుడ్మెత విశ్వనాథ్​తో కలిసి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, ప్రాథమిక సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 40 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా సెంటర్లలో రైతులకు తాగునీరు, నీడ, టార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆరిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఈసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నందున దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.  

అంగవైకల్య నిర్ధారణ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి

అంగవైకల్యం నిర్ధారణ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్  ధోత్రే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అంగవైకల్య నిర్ధారణ కేంద్రం కోసం కేటాయించిన గదులు, వాటిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడికి వచ్చే దివ్యాంగులు, వారి సహాయకులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, వైకల్య పరీక్షలకు సంబంధించిన పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.  

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకోండి 

కాగజ్ నగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను ఎంత త్వరగా నిర్మించుకుంటే అంత త్వరగా బిల్లులు వస్తాయని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లను మంగళవారం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డీఆర్డీవో దత్తారాం, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై లబ్ధిదారులతో మాట్లాడారు.

 గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతీరోజు ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లబ్ధిదారులకు సూచనలు చేయాలన్నారు. ఆర్థిక స్థోమత లేని పలువురు లబ్ధిదారులకు మండల సమాఖ్య ద్వారా రుణాల చెక్కులు అందజేశారు. అనంతరం కాగ జ్ నగర్ పట్టణంలోని సుప్రభాత్ స్కూల్​లో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే హరీశ్ బాబు, తహసీల్దార్ మధుకర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, ఐకేపీ ఏపీఎం వెంకటరమణ, హౌసింగ్ ఏఈ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.