
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పికప్ పాయింట్ బేకరీలో అమ్ముతున్న బ్రెడ్లో ఫంగస్ చేరింది. వినియోగదారుని ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ప్యాకింగ్పై వ్యాలిడిటీ ఉన్న బ్రెడ్లో ఫంగస్ వచ్చినట్టు వినియోగదారుడు గుర్తించాడు. తనిఖీల అనంతరం స్టాక్ను ఫుడ్ సేఫ్టీ అధికారిణి అనూష సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించారు.
2024 డిసెంబర్లో కూడా జగిత్యాలలోని బాబా సాయి బెంగళూరు బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. జగిత్యాల కొత్త బస్టాండ్ ఔట్ గేట్ ఎదురుగా ఉన్న బాబా సాయి బెంగళూరు బేకరీపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదని, బేకరీ లోపల కూడా అపరిశుభ్ర వాతావరణంలో కేకులు తయారుచేస్తున్నారని కొంతమంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన జగిత్యాల మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు.
ALSO READ | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
మున్సిపల్ అధికారులు ఈ బేకరీపై ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, బూజుపట్టిన బ్రెడ్తో కేకులు తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఈ విషయం తెలిసి బేకరీ యజమానిపై మున్సిపల్ అధికారులు మండిపడ్డారు.
బేకరీ ఐటమ్ తయారు చేసే వంటశాల పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడంతో పాటు కుళ్లి పోయిన కోడిగుడ్లు, కేకులు, బ్రెడ్ కు వాడే ఆహార పదార్థాలు కాలం చెల్లినవి ఉండడంతో బేకరీని సీజ్ చేసి యజమానికి నోటీసులు ఇచ్చారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే హోటళ్లు, బేకరీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.