
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ ప్రదర్శనలు చేశారు. మండలంలో తామంటే తామే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చలకు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళకారులను నియంత్రించారు. గత నాలుగైదు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్నాయకులు అభివృద్ధిపై చర్చకు నంది మేడారానికి రావాలని సూచించారు. ఈ క్రమంలో ఇవాళ నంది మేడారానికి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు.
అదే సమయంలో బీఆర్ఎస్నాయకులు ధర్మారం బస్టాండ్ ప్రాంతం నుంచి ర్యాలీగా చౌరస్తాకు బయల్దేరారు. పోలీసులు వారిని మధ్యలో అడ్డుకున్నారు. ఇరు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది.