27వ రోజుకు సమ్మె: బెదిరింపులకు లొంగకుండా ఆర్టీసీ కార్మికులు ఉద్యమం

27వ రోజుకు సమ్మె: బెదిరింపులకు లొంగకుండా ఆర్టీసీ కార్మికులు ఉద్యమం

    నేటితో 27వ రోజుకు సమ్మె

    విచ్ఛిన్నం కుట్రలను ఛేదిస్తూ ఐక్యంగా ముందుకు..

    కలిసివస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు

    కలవరపడుతున్న ప్రభుత్వ పెద్దలు

ఆర్టీసీ కార్మికులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా సమ్మె చేస్తున్నారు. బుజ్జగింపులకు లొంగకుండా డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్నారు. సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నా.. వాటిని ఛేదిస్తూ  ఒక్కతాటి మీద నడుస్తున్నారు. పనిచేసిన కాలానికి (సెప్టెంబర్​) జీతం ఇవ్వకపోయినా వెనుకడుగు వేయడం లేదు. రోజు రోజుకు కార్మికులకు మద్దతు రెట్టింపవుతోంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. అక్టోబర్​ 5న ప్రారంభమైన సమ్మె  మరో ఐదురోజులు గడిస్తే నెలరోజులు పూర్తవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో, ఇంతకాలం ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. వారి తెగింపు, ధైర్యాన్ని చూసి ప్రజలు సలాం కొడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. సమ్మె మొదలైనప్పుడు అనేక అనుమానాలు ఉండేవి. ఎక్కువ కాలం సమ్మె చేయలేరని అప్పట్లో ప్రచారం జరిగింది.  ‘వారం రోజులు సమ్మె  చేసుడే ఎక్కువ. మరీ ఎక్కువంటే  15 రోజులు చేస్తారేమో! అటు తర్వాత డ్యూటీలో చేరిపోతారు’ అని సమ్మె ప్రారంభమైన తొలి రోజుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అన్నారు. కానీ ఆర్టీసీ కార్మికుల ధైర్యానికి, ఐక్యతకు అందరూ అబ్బురపడుతున్నారు.

సెల్ఫ్​ డిస్మిస్​ అన్నా.. బెదరలే

అక్టోబర్ 5 న సమ్మె మొదలైన నాటి నుంచి సీఎం కేసీఆర్ అనేకసార్లు సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్షించారు. కార్మికులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం పలు వ్యూహాలు అమలు చేయాలని ప్రయత్నించింది. 6న సీఎం కేసీఆర్​ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ‘సంస్థను విలీనం చేసే ప్రసక్తి లేదు. కార్మికులతో చర్చలు జరిపేది లేదు’ అని ప్రకటించారు. ఆ ప్రకటనలో కొంతమంది కార్మికులైన డ్యూటీల్లోకి వస్తారని ప్రభుత్వ పెద్దలు ఆశించారు. కానీ ఎవరూ చేరలేదు. పైగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో  కేసీఆర్ మళ్లీ ఈ నెల 7న మరో సమీక్ష సమావేశం నిర్వహిచారు. ఆ సమావేశంలో ‘సమ్మె ఉధృతం చేస్తామనడం హాస్యాస్పదం. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మంది మాత్రమే. మిగతా వారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు. గడువులోపు డ్యూటీలోకి  చేరకపోవడంతో సెల్ప్ డిస్మిస్  అయినట్లే. డ్యూటీలోకి రాని కార్మికులు డిపోల ముందు, బస్టాండ్ల ముందు నిరసన చేపడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు’ అని హెచ్చరించారు. దీంతోనైనా కచ్చితంగా కార్మికులు డ్యూటీలో చేరుతారని ప్రభుత్వం భావించింది. కానీ కార్మికుల్లో కదలిక రాలేదు. హుజూర్ నగర్ ఫలితం వచ్చిన రోజు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇక ఆర్టీసీ ముగిసినట్టే. దాన్ని ఎవరూ కాపడలేరు. పనికిమాలిన, దిక్కుమాలిన సమ్మె. యూనియన్ల వల్లే ఈ పంచాయితీ. కార్మికులు అమాయకులైతే ఎక్కడివాళ్లు అక్కడ డిపోలకు వెళ్లి దరఖాస్తు పెట్టుకొని జాయిన్​ కావాలె’ అని అన్నారు. అయినా ఎవరూ వెనుకడుగు వేయలేదు. కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు.

ఆందోళనలో ప్రభుత్వ పెద్దలు

కార్మికులను దారిలోకి తెచ్చుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమవడం ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం వెనక్కి తగ్గరు. కార్మికులు తగ్గేలా లేరు. సమస్యకు ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో తెలియకుండా ఉంది’ అని ఓ సీనియర్ అధికారి అన్నారు.  ప్రస్తుతానికి మాత్రం కార్మికులదే పైచెయ్యిగా ఉందని చెప్పారు.