ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. మూడు డీఏలు, పండుగ బోనస్

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్..  మూడు డీఏలు, పండుగ బోనస్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు మూడు డీఏలతో పాటు దసరాకు ఇవ్వాల్సిన పండుగ బోనస్‌‌‌‌‌‌‌‌ను ఇస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. శుక్రవారం బస్ భవన్‌‌‌‌‌‌‌‌లో సంస్థ చైర్మన్ గోవర్ధన్‌‌‌‌‌‌‌‌, ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. సకల జనుల సమ్మె కాలంలో జీతాలు రాని 8,053 మంది ఉద్యోగుల కోసం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పదవీ విరమణ చేసిన సిబ్బంది ఈఎల్(ఎర్నెడ్ లీవ్స్)ను చెల్లించేందుకు మరో రూ.20 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. సంస్థలోని సమస్యలను పరిష్కరించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, పువ్వాడతో పాటు తనను యూనియన్‌‌‌‌‌‌‌‌ లీడర్లు కలిసి విన్నవించారన్నారు.

వీటిని తాము సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాలతో మంత్రులు చర్చలు జరిపారని చైర్మన్ పేర్కొన్నారు. సంస్థకు గతంలో రోజుకు రూ.9 కోట్ల ఆదాయం వస్తే, ప్రస్తుతం రూ.15 కోట్లు వస్తోందని, అయినా రోజూ రూ.4 నుంచి రూ.5 కోట్లు నష్టం వస్తోందని ఆయన తెలిపారు. గతంలో తీసుకున్న రూ.2,353 కోట్లకు ప్రతి నెల రూ.21 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. మునుగోడు బై పోల్ కోసమే ఇవి ప్రకటించారా అని మీడియా ప్రశ్నించగా, ఎలక్షన్ కోసం కాదని, ఆర్టీసీ కార్మికులు రాష్ట్రమంతా ఉన్నారని గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పీఆర్సీ ప్రకటించడం లేదన్నారు. ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

1,150 కొత్త బస్సులు కొంటున్నం: సజ్జనార్ 

ప్రజా రవాణాకు అనుగుణంగా 1,150 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. 360 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లు పిలిచామని, ఈ డిసెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆర్టీసీ డిపోలు మూసివేస్తున్నామన్న ప్రచారం అవాస్తవమని, ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.